ఏం సాధించారని సంబురాలు?

– టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి
– దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించాలి
– ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబురాలు జరుపుతున్నారని బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఈ ఉత్సవాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసిన తర్వాతనే గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్న పత్రాల లీకేజీలో కమిషన్‌ చైర్మెన్‌ జనార్దన్‌ రెడ్డి, ఏవోలను సిట్‌ అధికారులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. దీని వెనుక సీఎంఓ అధికారుల హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లయినా రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. కౌలు రైతుల సంక్షేమ నిధి ఎక్కడ అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాలను సప్లై చేస్తున్న వారిపై ఎందుకు పీడీ యాక్టుపై కేసులు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. రెవిన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ పేరుతో ఆర్‌ఓఆర్‌ చట్టంలో అనుభవదారు కాలం తొలగించి రైతుల హక్కులను పూర్తిగా కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు ద్వారా భూస్వాములకు ఎన్ని కోట్లు ఇచ్చారో, పేద రైతులకు ఎన్ని కోట్లు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ధరణి పోర్టల్‌ ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చారని ప్రశ్నించారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. సీక్రెట్‌ జీవోలు, చీకటి ఒప్పందాలతో ప్రభుత్వ నడుస్తున్నదని ఆరోపించారు. బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన నిధులెన్ని? ఎంత ఖర్చు చేశారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. హోంగార్డులను రెగ్యులరైజ్‌ చేస్తామంటూ పలు సార్లు హామీ ఇచ్చి ఎందుకు చేయదని ప్రశ్నించారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మత్స్యకార సంఘాలను బడా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి పేద ముదిరాజ్‌,గంగపుత్రల పొట్ట కొట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
పోలీసు లాకప్‌ డెత్‌లు కూడా జరుగుతున్నాయన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ అక్రమాలను ప్రశ్నించినందుకు అడ్వకేట్‌ యుగంధర్‌ పై ఎమ్మెల్యే అనుచరులు హత్యాయత్నానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. పారిశ్రామీకీకరణ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పేదల అసైన్డ్‌ భూములను గుంజుకున్న ప్రభుత్వం ఎన్ని వేల ఎకరాలను ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు కేటాయించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధులు డా. సాంబశివ గౌడ్‌,డా. వెంకటేష్‌ చౌహన్‌, కొంగరి అరుణ క్వీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love