నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న ప్రక్రియ త్వరలో మహారాష్ట్రలో కూడా జరుగుతుందని, దీనితో రిజర్వేషన్లపై 50 శాతం గోడలను బద్దలు కొడతామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో కులగణనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు. ఇందులో కులగణన ప్రక్రియకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ.. మోడీ జీ, తెలంగాణలో నేటి నుంచి కుల గణన ప్రారంభమైందని తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని ప్రతి వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి తాము దీని నుండి పొందిన డేటాను ఉపయోగిస్తామని వివరించారు. అంతేగాక త్వరలో మహారాష్ట్రలో కూడా ఇదే జరగనుందని తెలిపారు. ఇక దేశంలో సమగ్ర కుల గణన జరపడం బీజేపీకి ఇష్టం లేదన్న విషయం అందరికీ తెలిసిందే అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తాను మోడీకి స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ.. దేశవ్యాప్తంగా కుల గణనను మీరు ఆపలేరని స్పష్టం చేశారు. అలాగే ఈ పార్లమెంట్‌లో కుల గణనను ఆమోదించి, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం అడ్డుగోడలను బద్దలు కొడతామని రాహుల్ గాంధీ ఎక్స్(X) ద్వారా తేల్చి చెప్పారు.