అమరావతి : ఏపీ.ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజల సొమ్మును కొల్లగొట్టేలా చంద్రబాబునాయడు కుట్ర పూరితంగా వ్యవహరించారని సిఐడి కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో నిబంధనలేవీ పాటించలేదని తెలిపింది. ఏపీ సీఐడీ రూపొందించిన 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఆదివారం ఏసీబీ కోర్టుకు నివేదించింది. తెలంగాణకు చెందిన ఇల్లెందు రమేష్ ద్వారా చంద్రబాబును కలిసిన డిజిటెక్ కంపెనీ ప్రతినిధి సంజరు దాగా ఈ ప్రాజెక్టును రూపొందించారని తెలిపింది. స్కిల్ ప్రాజెక్టుపై ఇల్లెందు రమేష్ ఇచ్చిన లేఖను చంద్రబాబు ఉన్నత విద్యాశాఖకు పంపారని పేర్కొంది. 2014 ఆగస్ట్ 22న సచివాలయంలో చంద్రబాబును డిజిటెక్ ప్రతినిధి సంజరుదాగా, ఇల్లెందు రమేష్ కలిసి ప్రాజెక్టు గురించి చర్చించినట్లు వివరించింది. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 20న కేబినెట్ అనుమతి లేకుండానే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ ఎమ్‌డి, సిఇఒగా గంటా సుబ్బారావును, డైరెక్టర్‌గా కె లక్ష్మీనారాయణను నియమించినట్లు పేర్కొంది. ఎపి బిజినెస్ రూల్స్ ప్రకారం తప్పనిసరిగా క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా, ఆ అనుమతి లేకుండానే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపింది. చంద్రబాబు మార్గదర్శకత్వంలో మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా డిజిటెక్, సీమెన్స్‌తో కుమ్మక్కై నిధుల స్వాహాకు పథకం వేశారని పేర్కొంది. 2014 అక్టోబరు 20న తమ మనిషి జె వెంకటేశ్వర్లును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఆడిటర్‌గా నియమించారని తెలిపింది. అక్టోబరు 7నాటికి గంటా సుబ్బారావును ఉన్నత విద్యాశాఖ ఎక్స్ అఫీషియోగా నియమించి నిధులను పక్కదారి పట్టించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపింది. చంద్రబాబు ఆదేశాల మేరకు స్కిల్‌డెవలప్‌మెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీమెన్స్ ఇండియా ఎమ్డీ సౌమ్యాద్రి శేఖర్‌బోస్ అలియాస్ సుమన్ బోస్, స్కిల్ డిపార్ట్మెంట్ సిఎఫ్ఓ ప్రతాప్‌కుమార్, పుణె కంపెనీ డిజైన్‌టెక్ ఛైర్మన్ వినరు కాన్విల్కర్ తదితరులతో గంటా సుబ్బారావు కుమ్మక్కై ఎలాంటి బిల్లులు, కొటేషన్స్, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండా కేబినెట్ ముందుకు ప్రాజెక్టు ప్రతిపాదన పెట్టారని తెలిపింది. క్యాబినెట్ సమావేశానికి ఒకరోజు ముందుగా ప్రతిపాదన పెట్టి 2015 ఫిబ్రవరి 16న ఆగమేఘాల మీద ఆమోదించుకున్నారని పేర్కొంది. రూ 546.84 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖర్చుకు ఆమోదం చేసుకున్నారని తెలిపింది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా, ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ లేకుండా, థర్డ్ పార్టీ ఎవల్యూషన్ లేకుండానే క్యాబినెట్ ఆమోదం పొందడం వెనుక చంద్రబాబు కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. టెండర్ల పద్ధతిని కూడా అనుసరించలేదని, గంటా సుబ్బారావు సిఫార్సులతో రూ.370 కోట్లు విడుదలకు గ్రీన్ సిగల్ ఇచ్చారని తెలిపింది. సీమెన్స్ ప్రాజెక్టుకు నిధుల విడుదలలో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అభ్యంతరాలు, జోక్యాలు ఉండకూడదని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారని సిఐడి రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.