యూపీఐ లావాదేవీలపై లిమిట్‌.. ఏ బ్యాంకులో ఎంతెంత?

నవతెలంగాణ – హైదరాబాద్: యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ రాకతో దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకున్నాయి. తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా మారింది. దీంతో ఈ సేవలకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పరిమితులు పెంచుతూ, యూపీఐ లైట్‌ అంటూ అనేక మార్పుల్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది. అయితే రోజువారీ చేసే యూపీఐ చెల్లింపుల విషయంలో బ్యాంకుల వారీగా పరిమితులు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ : యూపీఐ లావాదేవీలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు లావాదేవీకి అనుమతిస్తోంది. 24 గంటల్లో గరిష్ఠంగా 20 లావాదేవీలను అనుమతిస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ : ఈ బ్యాంక్‌లో గరిష్ఠ లావాదేవీ పరిమితి రూ.లక్ష. రోజు మొత్తంలో అన్ని లావాదేవీలు కలిపి రూ.లక్ష వరకే అనుమతి. 24 గంటల్లో గరిష్ఠంగా 10 లావాదేవీలు జరిపేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ అనుమతిస్తోంది.

ఎస్‌బీఐ: రోజువారీ చెల్లింపుల పరిమితిని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.లక్షగా నిర్ణయించింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ , యెస్‌ బ్యాంక్‌, డీసీబీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌  సైతం ఇదే పరిమితిని అనుసరిస్తున్నాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB): రోజువారీ చెల్లింపుల పరిమితిని బ్యాంక్‌ ఆప్‌ బరోడా రూ.లక్షగా పేర్కొంది. రోజులో గరిష్ఠంగా 20 లావాదేవీలు జరిపేందుకు అవకాశం కల్పిస్తోంది.

కెనరా బ్యాంక్‌ : యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత లావాదేవీలపై కెనరా బ్యాంక్‌ రూ.లక్ష పరిమితి నిర్ణయించింది. రోజుకు 20 వరకు లావాదేవీలు జరపొచ్చని వెల్లడించింది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: యూపీఐ సాయంతో రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు బదిలీ చేయొచ్చు. రోజులో 10 లావాదేవీలు నిర్వహించవచ్చు. ఒక వేళ క్యూఆర్‌ కోడ్‌ని అప్‌లోడ్‌ చేసి డబ్బు చెల్లింపులు చేయాలంటే.. రూ.2,000 వరకు మాత్రమే అనుమతిస్తోంది.

యాక్సిస్‌ బ్యాంక్‌: డెబిట్‌ ఫండ్‌ చెల్లింపులు/వ్యక్తిగత చెల్లింపులపై రోజువారీ లిమిట్‌ రూ.లక్షగా యాక్సిస్‌ బ్యాంక్‌  నిర్ణయించింది.

Spread the love