– ఏఐఎస్ టీఎఫ్ జాతీయ అద్యక్షులు ఇంద్రశేఖర్ మిశ్రా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల పెన్షన్ బడ్జెట్ పెరుగుతున్నదన్న సాకు చూపించి 2004 నుంచి ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని అమలు చేయడం దుర్మార్గమని ఆల్ ఇండియా సెకెండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ టీఎఫ్) జాతీయ అధ్యక్షులు ఇంద్రశేఖర్ మిశ్రా విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో ఏఐఎస్ టీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఐదు సంవత్సరాల పదవీ కాలానికే పెన్షన్ పొందుతుండగా, మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ కార్యక్రమాలను విజయ వంతం చేసిన ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని అమలు చేయడం సరి కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపత్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ రద్దుపై తమ వైఖరిని మ్యానిఫెస్టోలో తెలపాలని డిమాండ్ చేశారు. కొఠారి కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర బడ్జెట్‌లో ఆరు శాతం, రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్‌లో 3 శాతం, రాష్ట్ర బడ్జెట్ లో 11 శాతం మించడం లేదని విమర్శించారు. అనేక దేశాలు విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వడం ద్వారా అబిృóవద్ధి చెందాయని ఆయన తెలిపారు. ఆదాయ పన్ను పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచాలనీ, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి నిదుల కేటాయింపు పెంచాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి, సెక్రటరీ జనరల్ సదానందం గౌడ్, ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్ బాబు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ అన్సారీ, తెలంగాణ ఎస్టీయూ అధ్యక్షులు యం.పర్వత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.సాయి శ్రీనివాస్, ఎం.రఘునాథ రెడ్డి, వివిధ రాష్ట్రాల నుంచి కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.