కసితో ఆడిన పాక్.. శ్రీలంక ముందు టార్గెట్ ఎంతంటే

నవతెలంగాణ – హైదరాబాద్: గెలిస్తేనే ఫైనల్ బెర్తు, ఓడితే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుందన్న నేపథ్యంలో పాకిస్థాన్ బ్యాటర్లు శ్రీలంకపై పట్టుదలగా ఆడారు. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. వర్షం రెండుసార్లు ఆటంకం కలిగించిన నేపథ్యంలో పాక్ ఆడాల్సిన ఓవర్లను 42కి కుదించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ 52, కెప్టెన్ బాబర్ అజామ్ 29 పరుగులు చేశారు. ఓ దశలో పాక్ 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ తెగించి ఆడారు. రిజ్వాన్ 73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇఫ్తికార్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేశాడు. వీరిద్దరి బాదుడుతో పాక్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. లంక బౌలర్లలో మతీష పతిరణ 3 వికెట్లు తీయగా, ప్రమోద్ మధుషాన్ 2, మహీశ్ తీక్షణ 1 వికెట్ పడగొట్టారు. కాగా, భారత్ పై 5 వికెట్లతో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె ఇవాళ పాకిస్థాన్ తో మ్యాచ్ లో తేలిపోయాడు. 9 ఓవర్లు విసిరి 40 పరుగులిచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు.

Spread the love