– ప్రచారంలో మోడీ కీలక అంశాల దాటవేత
– ప్రతిపక్షాలపై ఎదురు దాడికే ప్రాధాన్యత
– ఓటర్లను బురిడీ
న్యూఢిల్లీ : నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే చెబుతోంది. ‘గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఇవాళ ఉద్యోగం దొరకడం సులభమా లేక కష్టమా’ అని ప్రశ్నిస్తే కష్టంగానే ఉన్నదని 62 శాతం మంది కుండబద్దలు కొట్టారు. ‘ధరల పెరుగుదల మాటేమిటి? ఐదేండ్లలో పెరిగాయా తగ్గాయా’ అని అడిగితే ఏకంగా 71 శాతం మంది పెరిగాయనే చెప్పారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఉద్యోగాలు, ధరల పెరుగుదల, పొదుపు రేట్లు, ప్రజల జీవితాలు వంటి కీలక అంశాలను తన ఎన్నికల ప్రచారంలో తప్పనిసరిగా ప్రస్తావించాల్సి ఉంటుంది. కానీ ఆయన ఈ సమస్యలపై పెదవి విప్పరు. తన పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని, ప్రగతి పథంలో పయనిస్తోందని చెబుతుంటారు. ప్రతిపక్షాలు అనవసరంగా బురద చల్లుతున్నాయని ఆరోపిస్తారు. ఆయన ప్రసంగాల్లో ప్రతిపక్షాలపై విసుర్లే తప్ప ఎక్కడా ప్రజా సమస్యల ప్రస్తావన ఉండదు. ఆకట్టుకునే ప్రసంగాలతో ఓటర్లను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో కీలక అంశాల్లో మోడీ ప్రభుత్వ రికార్డును పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
పెరుగుతున్న నిరుద్యోగం
ముందుగా నిరుద్యోగాన్ని తీసుకుందాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15 సంవత్సరాలు, ఆపై వయసున్న వారిలో నిరుద్యోగ రేటు 8 శాతానికి పెరిగింది. అంతకుముందు రెండు సంవత్సరాల్లో ఈ రేటు 7.5 శాతం-7.7 శాతం మధ్య ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. ఈ సంస్థ అందించిన సమాచారం ప్రకారం దేశంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల సంఖ్య సుమారు 3.7 కోట్లకు చేరుకుంది. గత ఏడు సంవత్సరాల్లో నిరుద్యోగ రేటు ఒకే ఒకసారి…2020-21 కోవిడ్ సమయంలో…8 శాతం (8.8 శాతం) దాటింది. 2016-17లో 7.4 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 2023-24 నాటికి 8 శాతానికి చేరుకుంది. ఇక కార్మిక భాగస్వామ్య రేటు (ఎల్‌పీఆర్) కోవిడ్‌కు ముందున్న స్థాయికి చేరుకోవడానికి తంటాలు పడుతోంది. 2016-17లో మన దేశంలో ఎల్‌పీఆర్ 46.2 శాతంగా ఉంది. అది ఆ తర్వాతి మూడు సంవత్సరాల్లో 42 శాతం-44 శాతానికి పడిపోయింది. 2020-21లో 40 శాతానికి తగ్గింది. అప్పటి నుంచి అలాగే ఉండిపోతోంది. 2023-24లో ఎల్‌పీఆర్ 2016-17లో కంటే 5.8 పర్సంటేజ్ పాయింట్లు తగ్గింది. కార్మిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దాని ప్రకారం నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఈ సమాచారాన్ని మోడీ ప్రభుత్వం ప్రచురించలేదు.
ద్రవ్యోల్బణమూ అంతే
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. స్థిర ఆదాయాలు, పెరుగుతున్న ఖర్చులు తదితర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. 2023-24తో పోలిస్తే 2012-13లోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. అయితే నిరుద్యోగ రేటు ఇప్పుడు ఉన్నంత అధికంగా లేదు. ద్రవ్యోల్బణం పెరగడానికి బహుశా ఇది ఓ కారణం కావచ్చు. ధరల పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో అశాంతికి కారణమవుతోంది. ఫలితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది.
పొదుపు తగ్గిపోతోంది
2022-23లో కుటుంబ పొదుపు ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అదే సమయంలో రుణభారం పెరిగింది. వ్యక్తిగత రుణాలు అధికమయ్యాయి. గత రెండు సంవత్సరాల కాలంలో భద్రత లేని రుణాల సంఖ్య 23 శాతం పెరిగిందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్‌ను ఉటంకిస్తూ తమల్ బందోపాధ్యాయ అనే పాత్రికేయుడు తెలియజేశారు. కార్పొరేషన్లు, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇస్తున్న రుణాలు కూడా 12 శాతం-14 శాతం పెరుగుతున్నాయి.
నియంతృత్వం వైపు అడుగులు
2013-14 నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెరుగుతోంది. గత రెండేండ్లుగా మాత్రం ఈ సుంకం తగ్గుతోంది. అయినప్పటికీ 2014 నవంబరుతో పోలిస్తే ఎక్సైజ్ సుంకం అధికంగానే ఉంది. ఇక మన దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని తగిన ఆధారాలతో రుజువు చేస్తున్నాయి. మన దేశం అత్యంత వేగవంతంగా నియంతృత్వం వైపు నడుస్తోందని ఫ్రీడమ్ హౌస్, వి-డెమ్, ఐడియా, ఆర్థికవేత్తల సూచికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంస్థలు భారత్‌ను ప్రజాస్వామ్య దేశంగా పరిగణించడం లేదు. ‘ఎన్నికల నిరంకుశత్వం’గా వర్గీకరించాయి.
విస్తరిస్తున్న బిలియనీర్ల రాజ్యం
దేశంలో అసమానతలు వేగంగా పెరిగిపోతున్నాయి. బ్రిటీష్ వలసవాదుల పాలనతో పోలిస్తే ఇప్పుడు అవి మరింతగా పెరిగాయి. దేశంలో అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో 22 శాతం వనరులు ఉన్నాయని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ తెలిపింది. దేశంలో బిలియనీర్ల రాజ్యం వ్యాప్తి చెందుతోందని వ్యాఖ్యానించింది.
డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలూ తప్పేనట
భారత్‌లో 47 లక్షల మంది ప్రజలు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేసింది. 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వ అధికారిక లెక్కలతో పోలిస్తే ఇది సుమారు పది రెట్లు ఎక్కువ. అయితే డబ్ల్యూహెచ్‌ఓ సమాచారంతో మోడీ ప్రభుత్వం విభేదించింది. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలను తప్పు పట్టిన ఏకైక దేశం భారతే. కొట్టించే ప్రయత్నం