– మాది గాంధీ వారసత్వం.. మీది గాడ్సే వారసత్వం
– పనికిమాలిన పంచాయితీలతో లబ్దికి యత్నం
– కోమటిరెడ్డీ.. దమ్ముంటే రా.. తేల్చుకుందాం..
– కాంగ్రెసోళ్లకు ఓటేస్తే ఆగమే..: నల్లగొండ, సూర్యాపేట సభల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
”తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్లారు.. మాది పక్కా రాజకీయ వారసత్వమే.. మా మీద మాట్లాడే మోడీది ఏ వారసత్వం..? మాది జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వం. మీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ మీది. మా మీద మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే కాంగ్రెసోళ్లకైనా, బీజేపోళ్లకైనా మంచిది. చేతనైతే ఏం చేస్తారో చెప్పండి.. ఏం చేశారో చెప్పండి” అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ/ సూర్యాపేట
బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేండ్ల కాలంలో రెండుమార్లు రుణమాఫీ చేసింది నిజం కాదా.. మేమంటే ఎందుకో మోడీకి గిట్టదు మరి” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్, పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించారు. దళితబంధు చెక్కులను, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. పనికిమాలిన పంచాయితీలు పెట్టి రాజకీయంగా లబ్దిపొందాలని బీజేపీ చూస్తోందని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. ‘మాట్లాడితే కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్నారు.. బరాబర్ కుటుంబ పాలనే అందులో అనుమానమే లేదు. ఎందుకంటే.. కేసీఆర్ 4 కోట్ల మందికి కుటుంబ పెద్ద.. తెలంగాణ ప్రజలది వసుదైక కుటుంబం. ఈ కుటుంబానికి కేసీఆర్‌నే పెద్ద. ఇందులో నాకెలాంటి అనుమానం లేదు అని చెప్పారు. ఊసులేనోడు వచ్చి వారసత్వ రాజకీయం అని అంటున్నాడని విమర్శించారు. ”బీఆర్ఎస్ పార్టీది బరాబర్ రాజకీయ వారసత్వమే. రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ.. తెలంగాణ పౌరుషం రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టే.. గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసుకున్నాం. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం వారసత్వం మాది. బహుజన వీరుడు సర్వాయి పాపన్న వారసత్వం మాది. దళిత జాతి వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ వారసత్వం మాది. తెలంగాణ ఉద్యమాల్లో అసువులుబాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని ఇవాళ విధానంగా మార్చుకొని, సమర్థవంతంగా అమలు చేస్తున్న రాజకీయ వారసత్వం మాది. దాశరథి, కాళోజీల సాంస్కతిక వారసత్వం మాది” అని చెప్పారు.
మరోవైపు ఎలాగైనా అధికారంలోకి రావాలనే తపనతోనే కాంగ్రెసోళ్లు ట్రిక్కులు ప్లే చేస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీ కార్డులిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వారెంటీ అయిపోయి 100 ఏండ్లు అయిందన్నారు. ఆ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ముసలి నక్క అని, నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపలా పెట్టినట్లేనని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికి.. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దని కాంగ్రెస్‌లో సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెసోళ్లకు ఓటేస్తే భవిష్యత్ ఆగమవుతుందని, ఐదేండ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారుతారని ఎద్దేవా చేశారు. ఉచిత కరెంట్ 24గంటలు రావడం లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారన్నారు. ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం రా అంటూ కోమటిరెడి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా సూర్యాపేటలో జగదీశెడ్డి విజయం ఆపలేరని, 50 వేల మెజార్టీతో జగదీశ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా వేధిస్తున్న సాగు తాగునీటి సమస్యల నుంచి పేట ప్రజలకు విముక్తి కల్పించామన్నారు. సూర్యాపేటలో 200 మందితో ప్రారంభించుకున్న ఐటీ పరిశ్రమను రాబోయే మూడేండ్లలో 5000 మందికి విస్తరిస్తామని చెప్పారు.