ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి…

తనదాకా వస్తే గానీ తత్వం బోధపడదంటారు పెద్దలు. గత పదేండ్ల కాలంలో ఒకట్రెండు సందర్భాల్లో, ఒకటీ అరా సీట్లలో తప్ప… ఓటమన్నదే ఎరుగని గులాబీ పార్టీకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోకముందే పుండుమీద కారం చల్లినట్టు… లోక్‌సభ ఎలక్షన్ల వేళ సీనియర్లు, జూని యర్లు, సిట్టింగులు, మాజీలనే తేడాల్లేకుండా నేతలందరూ ‘కారు’ దిగుతున్నారు. నిన్న గాక మొన్న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ ముందు బీఆర్‌ఎస్‌ బాస్‌ పుట్టిన రోజు సందర్భంగా దళపతికి శుభాకాంక్షలు తెలుపుతూ నిలువెత్తు కటౌట్‌ పెట్టిన ‘ఖైరతాబాద్‌ దానం…’ ఇప్పుడు పార్టీకి పంగనామం పెట్టి హస్తం గూటికి చేరిపోయారు. పైగా పక్కలో బల్లెంలా సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చేవెళ్ల సీటు నుంచి సిట్టింగైన గడ్డం రంజిత్‌రెడ్డే మరోసారి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేస్తారంటూ కేసీఆర్‌ ప్రకటించినా ఫలితం లేకపోయింది.
అసలు మొత్తం 17 సీట్లలో తొలుత గులాబీ పార్టీ నుంచి ప్రకటించింది చేవెళ్లే. అయినా రంజిత్‌ను ఆపలేకపోయారు. ‘ప్రస్తుత సమ యంలో నేను పార్టీ మారక తప్పటం లేదంటూ’ నిర్మొహమాటంగా చెప్పిన ఆయన… అదే చేవెళ్ల నుంచి ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. అందరికంటే ముందే పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌ నేతగాని…బీఆర్‌ఎస్‌కు బైబై చెప్పి, అధికార పార్టీ పంచన చేరారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌, జహీరాబాద్‌ ఎంపీలు రాములు, బీబీ పాటిల్‌ కమలం తీర్థం పుచ్చుకోగా, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌… మూడు రంగుల కండువా కప్పుకున్నారు. ఈ రకంగా నేతలందరూ ‘నా వల్ల కాదు.. నేనిక్కడుండలేను…’ అంటూ వీడ్కోలు పలుకుతున్న వేళ, గులాబీ దళపతి నైరాశ్యంలో అన్నారో, లేక వాస్తవాలను గ్రహించారో తెలియదు గానీ…’నేనెప్పుడూ ఎవర్నీ దుర్భాషలాడలేదు.. కావాలని ఎవర్నీ కించపరచలేదు..ఉద్యమ సమయంలో అనివార్యంగా కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చిందంతే…. అంతే తప్ప ఏనాడైనా ఎవర్నైనా పల్లెత్తు మాట అన్నానా…?’ అంటూ ఆవేదన వ్యక్తం చేయటం చూసి పాత్రికేయులు ముక్కున వేలేసుకున్నారు. నిన్న మొన్నటి వరకూ పత్రికలను, ప్రతిపక్షాలను రాయలేని భాషలో, మాట్లాడలేని రీతిలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టకుండా తిట్టింది ఇదే సారు కదా..? ఆ తిట్లను నేర్చుకుంటే పిల్లలు ఎక్కడ చెడిపోతారే మోననే భయంతో మనమే కదా టీవీలు కట్టేసింది…? ఆయన వాడిన భాష, చేసిన వెటకారాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అనేక సెటైర్లు విసిరారు కదా..? మరి ఇవన్నీ మరిచి…’నేను ఎవర్నీ ఏమీ అనలేదు…’ అంటూ సారు సాఫ్ట్‌ కార్నర్‌లో మాట్లాడుతుంటే… ‘ఆహా… ఏం సెప్తిరి, ఏం సెప్తిరి, మీరెప్పుడూ ఇలాగే చెప్తారా…?’ అంటూ ఇప్పుడు మళ్లీ సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి…
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love