గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక అత్యంత అందమైన ప్రయాణం. అయితే వేసవిలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవడమే కాదు, పోషకాహారాన్ని తీసుకొని బిడ్డ ఆరోగ్యాన్ని, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
గర్భిణులు వేసవికాలంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు, సహజ చక్కెరలు నిండి ఉన్న ఆహారాలను అధికంగా తినాలి. వీటిని తినడం వల్ల జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణ క్రియను, పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. డైటీషియన్లు చెప్పిన ప్రకారం గర్భిణీలు వేసవిలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎలాంటి పదార్థాలను దూరంగా పెట్టాలో తెలుసుకుందాం.
ఏం తినాలి?
గర్భిణులు వేసవిలో పుచ్చకాయలను తినటంవల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచుÊ. నిమ్మకాయ రసం, కివీ పండ్లు, జామ, పీచ్, రేగు పండ్లు అధికంగా తినాలి. వీటన్నింటిలో కూడా ఇనుము అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్, ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్ పండ్లు ప్రతిరోజూ రెండు తినడం చాలా అవసరం. అలాగే రోజుకో అవకాడో పండు తింటే మంచిది. దీనిలో మంచి కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇక రోజుకు రెండు అరటిపండ్లు కూడా తినాలి. మామిడి పండ్లు తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి పోషకాలు పుష్కలంగా అందుతాయి. అలాగే నీళ్లు అధికంగా తాగుతూ ఉండాలి. లస్సీ, కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి అధికంగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
ఏం తినకూడదు?
గర్భిణీలు ఇంట్లో తయారుచేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బయట దొరికే మిల్క్ షేక్స్ వంటి చక్కెర పానీయాలను తీసుకోకూడదు. పంచదార కలిపిన పానీయాలకు, ఆహారాలకు దూరంగా ఉండాలి. సోడాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు. కాఫీ, టీలు కూడా మానేయడమే మంచిది. వేసవిలో కాఫీ, టీలు శరీరాన్ని డిహైడ్రేషన్కు గురయ్యేలా చేస్తాయి.