రూ.2వేల నోట్లు మార్చుకోకపోతే ఏమవుతుంది?

ఢిల్లీ: క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్లు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. చలామణి నుంచి రూ.2వేల నోటును ఉపసంహరించిన నేపథ్యంలో ప్రజల్లో నెలకొనే సందేహాల నివృత్తికి ప్రశ్నలు, జవాబుల రూపంలో కొంత సమాచారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసింది.

1. క్లీన్‌ నోట్‌ పాలసీ అంటే ఏంటి?
ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉంచడం.

2. రూ.2వేల నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయా?
అవును. వాటి చెల్లుబాటు కొనసాగుతుంది.

3. ఈ నోట్లను సాధారణ అవసరాలకు ఉపయోగించుకోవచ్చా?
చేసుకోవచ్చు. ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం రూ.2వేల నోట్లు ఉపయోగించొచ్చు. ఎవరైనా చెల్లిస్తే తీసుకోవచ్చు. కానీ సెప్టెంబరు 30లోపు వాటిని బ్యాంకులో డిపాజిట్‌ చేయడమో, మార్చుకోవడమో చేయాలని ప్రోత్సహిస్తున్నాం.

4. రూ.2వేల నోట్లు ఉన్న వారు ఏం చేయాలి?
సెప్టెంబరు 30లోపు ఏ బ్యాంకులోనైనా తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు. లేదంటే మార్చుకోవచ్చు.

5. రూ.2వేల నోట్ల డిపాజిట్‌పై పరిమితి ఉంటుందా?
నో యువర్‌ కస్టమర్‌ నిబంధనలు (కేవైసీ), ఇతరత్రా చట్టబద్ధమైన, నియంత్రణ పరమైన నిబంధనలకు లోబడి ఎలాంటి నియంత్రణ లేకుండా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు.

6. రూ.2వేల నోట్ల మార్పిడిపై ఏదైనా పరిమితి ఉందా?
ప్రజలు ఒక్కోసారి రూ.20వేల వరకు విలువైన రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు.

7. బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా ఈ నోట్లు మార్చుకోవచ్చా?
ఖాతాదారు రోజుకు రూ.4వేల వరకు బిజినెస్‌ కర్పస్పాడెంట్ల ద్వారా మార్చుకోవచ్చు.

8. మార్పిడి సౌకర్యం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది?
బ్యాంకర్లు తగిన సౌకర్యాలు ఏర్పాటుచేసుకోవడానికి వీలుగా ప్రజలకు మే 23 నుంచి సెప్టెంబరు 30 వరకు అన్ని బ్యాంకు బ్రాంచీలు, 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లు మార్చుకోవడానికి వీలుకల్పిస్తున్నాం.

9. రూ.2వేల నోటు మార్చుకోవాలంటే బ్యాంకు ఖాతాదారుడై ఉండటం తప్పనిసరా?
లేదు. ఖాతాలేని వారు కూడా ఒక్కోసారి బ్రాంచ్‌ల్లో రూ.20వేల విలువైన నోట్లను మార్చుకోవచ్చు.

10. వ్యాపార అవసరాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ఎవరికైనా రూ.20వేలకు మించి నగదు అవసరమైతే?
ఎలాంటి పరిమితులు లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాంకు ఖాతాలో జమచేసిన తర్వాత అందులోని నిల్వల ఆధారంగా నగదు తీసుకోవచ్చు.

11. నోట్లు మార్చుకోవడానికి ఫీజు చెల్లించాలా?
అవసరంలేదు. ఉచితంగానే మారుస్తారు.

12. నోట్ల మార్పిడి, డిపాజిట్లకోసం వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా?
ఇలాంటి వారికి అసౌకర్యం తగ్గించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా బ్యాంకులను ఆదేశించాం.

13. ఒకవేళ ఎవరైనా తక్షణం రూ.2వేల నోట్లు డిపాజిట్‌ చేయకపోయినా, వెంటనే మార్చుకోకపోయినా ఏమవుతుంది?
మొత్తం ప్రక్రియను సున్నితంగా కొనసాగించడానికి ప్రజలకు నాలుగు నెలల సమయం ఇచ్చాం. ఈ గడువు లోపు ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి.

14. రూ.2వేల నోట్లు డిపాజిట్‌కు / మార్చడానికి బ్యాంకులు తిరస్కరిస్తే ఏం చేయాలి?
బ్యాంకు సేవల్లో లోపం ఉంటే వినియోగదారుడు తొలుత సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన 30రోజుల్లోపు బ్యాంకు స్పందించకుంటే, ఒకవేళ బ్యాంకు స్పందన సంతృప్తికరంగా లేకుంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీం కింద ఆర్‌బీఐ పోర్టల్‌లోని కంప్లయింట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో ఫిర్యాదు చేయొచ్చు.

Spread the love