‘పెట్టెలో’ ఏముంది…?

'పెట్టెలో' ఏముంది...?పెట్టె అంటే డబ్బా. డబ్బా అంటే బాక్సు. ఆ పెట్టె గళ్ళా పెట్టె కావచ్చు, పుస్తకాల పెట్టె కావచ్చు, మందులుండొచ్చు, విలువైన పత్రాలుండవచ్చు. లేదా ఖాళీగానో ఉండొచ్చు. ఇంట్లో సద్దిపెట్టె కూడా ఒక పెట్టెనే. సూటుకేసులు, బ్యాగులు కూడా పెట్టెలే. రూపు మారిందంతే. అవే ఇప్పుడు మనుషుల రూపు కూడా మారుస్తాయి. వారి భవిష్యత్తునూ మారుస్తాయి. ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. అందులో ఆదాయమెంత, ఖర్చులు దేనికి ఎంత చేయాలి, అసలు వేటిపై ఖర్చు పెట్ట కూడదు, ఆదాయం కావాలంటే వేటిని అమ్మాలి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ బడ్జెట్‌ అంటే ఏమిటో, ఆ పదం ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకోవాలి. ఫ్రెంచి భాషలో బడ్జెట్‌ అంటే బ్రీఫ్‌ కేసు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అదో పెట్టె. పైకి ఆ పెట్టె అందరిది అని చెప్పినా, అందులో కావలసినవాళ్ళకు కావలసి నన్ని ఉంటాయి. ఆ విషయాలన్నీ ఫిబ్రవరిలో చెప్పు కుంటే బాగుంటుంది. అప్పుడు అమాత్యులవారు తాము చేయవలసింది చేసి ఎవరెవరికి ఏమేమి చేయాలి అన్న పనిపైనే ఉంటారు. పెట్టె అంటే డబ్బా. డబ్బా అంటే బాక్సు అని గుర్తుపెట్టుకుంటూ ముందుకు పోదాం.
డబ్బా వాయించడం అయిపోయింది. అంద రూ అలసిపోయిన యుద్ధవీరుల్లా ఉన్నారు. క్షతగాత్రుల్లా ఉన్నా రు. ఇప్పుడు అందరి భవిష్యత్తూ డబ్బాలో దాగుంది. ఇప్పటికే డబ్బా అంటే ఏమిటో అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఓట్ల డబ్బా… బ్యాలెట్‌ బాక్సు. అసలు గుండ్రంగా ఉంది కాని ఈ ప్రపంచమే ఒక డబ్బా. గుండ్రటి డబ్బా. ఈ డబ్బానిండా డబ్బు, హోదా, రాజకీయం, రావణీయం, కీచకీయం ఇలా ఎన్నో కీ యాలు. కొత్త పేర్లలో కొన్నింటికి ‘కీ’ కలిపి కూడా వాడుకోవచ్చు. ‘కీ’ మాత్రం ప్రజల చేతిలో ఉండింది. ఇప్పుడు ఆ తాళం చెవితో డబ్బా తీయాలి. అసలైన ఉత్కంఠ. సర్వత్రా సస్పెన్స్‌ ఇప్పుడే. ఎవరు రాజో, ఎవరు మంత్రో, ఎవరు బంటో, ఎవరు చాణక్యుడో, ఎవరు శ్రీకష్ణుడో, ఎవరు శకుని మామో, తొడలు విరిగిన సుయోధనుడో తెలి సేది ఇప్పుడే. ఇదో రసవత్తరమైన ఘట్టం. ఈ మెలో డ్రామాను వివరించాలంటే మళ్ళీ ఓ తిక్కన రావలసిందే. ఆయనైతే మాంచి నాటకీయత కలిపి చెల్లియో చెల్లకో అంటూ అందరికీ చెల్లుబాటయ్యే పద్యాలు చెబుతాడు. ఏ ఎన్నిక చూసినా ఏమున్నది గర్వకారణం అనేవారేమో మహాకవి శ్రీశ్రీ.
కొందరు ఈ రాష్ట్రంలో కూడా డబ్బా పగలగొట్టి తమ డబ్బాల సంఖ్యను పెంచు కుందామని దూకుడుగా వచ్చి, మధ్య లో తమకు ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అవే ముఖ్యం కదా అని తెలుసుకొని మిడిల్‌ డ్రాపులా కాకుండా కొనసాగి ఉండొచ్చు. ఇంకొందరు అసలు ఈ డబ్బాలన్నీ మావి కావలిస్తే చరిత్ర చదూకొండి అని కబడ్డీ డబ్బాలో లాగ తాము అరవాల్సింది అరవొచ్చు. జీవుల్లో ఉండే కణం ఒక పెట్టె. మనుషులు కూడా జీవులే కాబట్టి వారిలోనూ కొన్ని కోట్ల పెట్టెలు అంటే కణాలు ఉంటాయి. కొన్ని కణాలు కలిస్తే కణజాలమని మా జువాలజీ సారు ఎప్పుడో చెప్పింది గుర్తుంది. ఒక్కో కణం ఒక బ్యాటరీ లాంటిది. మనకి శక్తిని స్తూ ఉంటుంది. అలాంటి శక్తినిచ్చే డబ్బాలు మనిషికి ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడు కుంటున్నాం. బాక్సు బద్దలవ్వడం గురించి అందరూ వినే ఉంటారు. అందుకే ఎవరి బాక్సులు వారు బద్దలవకుండా చూసుకొమ్మంటారు.
అసలు జీవితమే ఒక డబ్బా. అందులోనే అందరమూ తిరు గుతూ ఉంటాం. మన ఊరే అనుకుంటే అతి చిన్న డబ్బా. లేదూ మన జిల్లా, లేదా రాష్ట్రం అనుకుంటే కొంచెం పెద్ద డబ్బా. కాదూ దేశమంతా నాదే అనుకుంటే ఓ మాదిరి డబ్బా. ప్రపంచమంతా అనుకుంటే ఇంకా పెద్దది. అదీ చాలక ఎనిమిది గ్రహాలూ నావే అనుకుంటే డబ్బా సైజు పెరుగుతుంది. గ్రహాలు ఇప్పుడు తొమ్మిది కాదని గ్రహించాలి అందరూ. ఈ విశ్వమే ఓ గుండ్రటి డబ్బా అని తేల్చేశారు శాస్త్రవేత్తలు. డబ్బాకు ఈ గుండ్రానికి అస్సలు సరిపోదంటే ఒక విన్నపం. క్రికెట్‌ బంతి ఏ ఆకారం? అది ఎన్ని రకాలుగా డబ్బు చేసుకోవచ్చు చెప్పండి. దాని వెనుక టీవీ అనే డబ్బాలో చల్లని పానీయాలు, విదేశీ చిప్సు, బాడీ స్ప్రేలు, ఆరోగ్య పానీయాలు, కార్లు, జీపులు, గుట్కాలు, పాన్‌ మసాలాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ప్రకటనలే. అన్నీ స్టేడియం అనే డబ్బా చుట్టూ తిరిగేవే. డబ్బుకు లోకం దాసోహం అని తెలిపేవే.
డబ్బానిండా బంగారం, డబ్బూ ఉన్నవారే సీఎం అవుతారు అంతే కాని ఇదేమీ సినిమా కాదు అని మా మిత్రుడు అంటాడు. రఘు అను నేను సీఎం అవ్వడానికి ఎటువంటి అవకాశమూ లేదు. కేజ్రీవాల్‌ కాలేదూ… అని ఎవరైనా ప్రయత్నిస్తే తప్పు లేదు.. ప్రజలే నా బంగారం, ప్రజలే నా డబ్బు, ప్రజలే నా సర్వస్వం అన్జెప్పినా వెంటనే ఎవ్వరూ నమ్మరు. నమ్మకం రావడానికి చాలా ఏండ్లు పడుతుంది. నమ్మకం కలిగేంతలో వింతలూ, విడ్డూరాలు జరగొచ్చు. ఒకోసారి సెంటిమెంటే డబ్బూ, బంగారం అవ్వొచ్చు. అది డబ్బాలో పెట్టి కొద్దికొద్దిగా వాడుతూ ఉంటే కొంత కాలానికి అదీ ఐపోతుంది. అది తెలిసిన వాళ్లు ఈసారి ప్రజల్ని రెచ్చగొట్టడమే బంగారం అది మా దగ్గరా డబ్బాలకు డబ్బాలుంది అని ప్రయ త్నాలూ చేసే అవకాశమూ ఉంది. నీచగుణ ములెల్ల నిర్మూలమె ౖపోవు, కొదువలేదు సుజన గోష్టివలన అని వేమన అన్నట్టు, చెప్పలేదంటనకపొయ్యేరు అని బ్రహ్మం గారన్నట్టు ఎప్పుడూ ఎవరో ఒక మహాత్ములు చెబుతూనే ఉంటారు. వినేవాళ్లు దొరక డమే కష్టం. ఆ వినేవాళ్లు పల్లె ల్లోనే ఎక్కువగా ఉన్నట్టున్నారు, నగరవాసులకు ఇంకే భాషలో చెప్పాలో మరి? ఇక్కడ ఇంకో విషయం, ఆ నగర వాసులు మౌన భాషలో ఏం చెప్పదలచారో అది తెలుసుకోవాలి మరి!!
లిలిలి
మెజీషియన్‌ బాక్స్‌ లేదా ఇంద్ర జాలికుల పెట్టె, అది టోపీ రూపంలో ఉంటుంది. అందులోనుంచి ఏవేవో వస్తువులు తీసి చూపిస్తుంటారు. ఏవేవో మంత్రాల్లాంటి మాటలు చెబు తుంటారు. ఖాళీ టోపీలోంచి పక్షుల్ని, కుందేళ్ళనీ తీస్తారు, ఇంకా ఎన్నో. ఇప్పుడు ఆ టోపీ ఓటరు చేతిలో ఉంది. తనకు టోఫీ పెట్టిన, పెట్ట దలచిన వాళ్ళను ఓ చూపు చూసి ఉంటారు. ఓటరేమి చేసేదీ చూద్దాం రండి……
హాం ఫట్‌… అబ్రకదబ్ర…. దబ్రక అబ్ర…
ఇదో ఖాళీ టోఫీ కావలిస్తే బోర్లిస్తాను చూడండి… నిజమే ఖాళీదే
హాం ఫట్‌… అబ్రకదబ్ర…. దబ్రకఅబ్ర… చేతిలోని మంత్రదండం టోపీ చుట్టూ తిప్పి…
చిలకను తీస్తాను చూడండి…
అందులోంచి ఎలక వచ్చింది… మాయమైంది
ఈసారి పావురం తీస్తాను…..
డేగ వచ్చింది… మాయమైంది
కర్చీఫు తీస్తానిప్పుడు….
చిరిగిపోయిన ఖద్దరు అంగీ వచ్చింది….మాయమైంది
అబ్బో…. ఎంత ఆశనో.. ఆశ దోశ అప్పడం…. ఇంకొన్ని గంటలు ఆగండి మరీ ఎందుకంత తొందర…..
నా షోని అంటే ఇంద్రజాల కార్యక్రమాన్ని టీవీ తెరమీదకు మారుస్తున్నాను…
ఓట్లు వేశేశాం ఇక కొట్టుకుచావండి…
తాంబూలాలిచ్చాం…. ఇక తన్నుకు చావండి… మహాకవి గురజాడా నీకు హ్యాట్సాఫ్‌…
జంధ్యాల రఘుబాబు
9849753298

Spread the love