నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో త్వరలో ఎన్నికలకు నగారా మోగనుంది. మంగళవారం రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మూడు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల సన్నద్దతమై రాష్ట్ర అధికారులతో సమీక్షించనున్నారు. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 5వ తేదీ తర్వాత ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చని అంటున్నారు. తెలంగాణకు ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లపై నివేదిక సమర్పించనున్నారు. దీంతో 6 లేదా 7న ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఈసారి కూడా అక్టోబర్‌లో వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ప్రధాని మోడీ మూడు రోజుల వ్యవధిలోనే రెండు రోజులు తెలంగాణలో పర్యటించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కూడా దాదాపు అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. టీ కాంగ్రెస్ త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశముంది. మరోవైపు బీఎస్పీ తొలి జాబితాను నేడు విడుదల చేసింది.