కల్వర్టు నిర్మాణమెప్పుడో?

– మల్లన్నసాగర్‌ కాల్వ నిర్మాణం పూర్తి
– కల్వర్టు నిర్మించడం మరిచిన కాంట్రాక్టర్లు
– ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
– బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పిదాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
– నార్లాపూర్‌లో కల్వర్టు నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు
నవతెలంగాణ- నిజాంపేట
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ కాల్వల ద్వారా నీటిని తరలించి చెరువులను, కుంటలను నింపి రైతులకు అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాల్వల నిర్మాణం చేపట్టింది. నిజాంపేట మండలం నార్లాపూర్‌ గ్రామంలో కాల్వలు తీశారు. కల్వర్టులు నిర్మించడం మరిచారు. కాల్వల పనులు కూడా అక్కడక్కడా సగం పూర్తి చేసి వదిలేశారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్వకుంట, వెంకటాపూర్‌, రజాక్‌పల్లి, నార్లాపూర్‌, పులిమామిడి గ్రామాల ప్రజలు, వందల కొద్ది వాహనాలు నిత్యం నడుస్తుంటాయి. మల్లన్నసాగర్‌ కాల్వపై కల్వర్టు నిర్మించకపోవడంతో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంటున్నారు. పాలకులు, అధికారులు పర్యవేక్షించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను అసంపూర్తిగా వదిలేశారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు పూర్తి చేయలేకపోయామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తప్పిదాలతోనే కాల్వ పనులు పూర్తి చేయలేకపోతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి నార్లాపూర్‌ గ్రామంలో మల్లన్నసాగర్‌ కాల్వపై కల్వర్టులు నిర్మించాలని వేడుకుంటున్నారు.

కల్వర్టు నిర్మించాలి
కాల్వ పనులు మొదలుపెట్టి దాదాపు మూడు సంవత్సరాలు దాటింది. ఈ దారిపై నిత్యం వందల కొద్ది వాహనాలు నడుస్తుంటాయి. రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్వర్టు నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మల్లన్నసాగర్‌ కాల్వపై కల్వర్టు నిర్మిస్తే ఇబ్బందులు తొలగిపోతాయి.
– సిగుళ్ల లింగం, నార్లాపూర్‌

ఇబ్బందులు తొలగించండి
నార్లాపూర్‌, పులిమామిడి గ్రామాల మధ్య మల్లన్న సాగర్‌ కాల్వ నిర్మించారు. కల్వర్టులు మర్చారు. కల్వర్టు కట్టలేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్‌, గజ్వేల్లి, చేగుంట, దౌల్తాబాద్‌, ప్రధాన నగరాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు ప్రధానమెంది. అధికారులు స్పందించాలి.
– బత్తుల నరసింహులు, నార్లాపూర్‌

Spread the love