ఆ రోజులు ఎప్పుడొస్తాయో?!

‘వరకట్న నిషేధ చట్టం..’, ‘కేరళలో కట్నం అడిగితే డిగ్రీ సర్టిఫికెట్‌ క్యాన్సిల్‌’ అబ్బ.. ఎంత బాగున్నారు ఈ మాటలు వినడానికి. ఏమిటో! సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ, కొన్ని ఆచారాలు మాత్రం ఎంత కష్టం, నష్టం కలిగిస్తున్నా అవి మాత్రం మారవు. నా చిన్నప్పుడు మా అమ్మావాళ్ళు అనుకునేవాళ్ళు… మా పిల్లలకి కట్నం ఇవ్వం, తీసుకోం, వాళ్ల పెళ్లిళ్ల టయానికి మళ్లీ కన్యాశుల్కాలు వస్తాయిలే అని. నా పెళ్ళే కాదు, మా అమ్మాయి పెళ్ళి కూడా అయిపోయింది. కన్యాశుల్కం సంగతి పక్కన పెడితే, ఈ కట్నాల గోల పోలేదు సరి కదా, ఇంకా పెరిగింది. కాకపోతే రూపం మార్చుకుంది. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడే నయం… ఆడపిల్ల పెళ్ళికి కట్నంగా కాస్తో కూస్తో పెళ్ళి ఖర్చులకని డబ్బు ఇచ్చేవారట! కొంతమందైతే అది కూడా లేకుండా ఇవ్వదలచుకున్నది ఇల్లు, పొలం లాంటివి స్తిరాస్థి రూపంలో ఆడపిల్ల పేర పసుపుకుంకుమగా పెట్టేవారట. తర్వాత కాలంలో చిన్నగా కట్నాన్ని డబ్బు (రొక్కం) రూపంలో వసూలు చేశారు మగపెళ్ళివారు. వందమందిలో ఏ నలుగురైదుగురో తప్ప మిగతా అంతా కట్నం కచ్చితంగా డబ్బు రూపంలోనే ఇవ్వాలని పట్టుబట్టేవారే. అమ్మాయికి నగలరూపంలో బంగారం ఎటూ పెడుతూనే వుంటారు తల్లిదండ్రులు.
మా అమ్మా, నాన్నల్లాగే మేం కూడా అనుకున్నాం… మా పిల్లల పెళ్ళి సమయానికైనా కట్నాలు పోతాయేమోలే అని. కానీ, కానీ ఏ మార్పూ లేదు. కట్నం అడిగే స్టైల్‌ మారిందంతే.
”మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం!, పెళ్ళిమాత్రం ఘనంగా చేయాలి. అమ్మాయికి నగలు ఏమేం చేయించారేంటి? ఓ కాసులపేరూ, అర డజను గాజులూ, ఓ డైమండ్‌ నక్లెస్‌, ఇంకో పెద్ద హారం అయితే కచ్చితంగా అమ్మాయికి పెళ్లిలో వేయాలండోరు! ఇక ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోండి. అన్నట్టు… మా వాళ్లు కాస్త భోజన ప్రియులు… వంటకాలు అవీ కాస్త ఎక్కువ వెరైటీలు చేయించండి. స్వీట్లు మాత్రం అరడజను వుండాలండీ! నాన్‌వెజ్‌లో నాలుగు రకాలు ఎటూ మీరే పెడతారనుకోండి. ఇంకో విషయం మర్చిపోయామండోరు… మా వైపు ఓ పదిమందికి కంచి పట్టుచీరలు తప్పనిసరిగా పెట్టాలి. అది మా ఆచారం. డెస్టినేషన్‌ పెళ్లయితే బాగుంటుంది కానీ, మీకు మరీ ఖర్చు పెరిగిపోతుంది అనుకుంటున్నారు కదా… మేం అంత బడ్జెట్‌ మీకు పెట్టదలచుకోలేదండీ. అందుకే అలాంటిదేం అడగట్లేదు. సింపుల్‌గా మెహందీకి, సంగీత్‌, హల్దీకి మా వైపు నుండి ఓ ముప్పై మంది వస్తారంతే! వారికి ఏ ఇబ్బందీ కలగకుండా తగిన ఏర్పాట్లు చూసుకుంటే చాలు…” ఇలా వుంటున్నాయి ఈ మధ్య పెళ్లిళ్ల మాటలు. ఇక ఎన్నారైల సంబంధాల పేరెంట్సయితే ‘మాకు కట్నం ఏమీ వద్దండీ, మీ అమ్మాయి యుఎస్‌లో ఎం.ఎస్‌ చేయించండి చాలు’ అంటున్నారు. ఆల్రెడీ ఎం.ఎస్‌. చేసిన అమ్మాయైతే వడ్డాణాలు, వంకీలు చేయించాలి. డెస్టినేషన్‌ పెళ్లికి ట్రాన్స్‌పోర్ట్‌ ఏర్పాట్లు చూడాలి. ఇలాంటి లిస్ట్‌ విన్న తర్వాత వామ్మో.. దీనికంటే కట్నం అడిగితేనే బావుండేది కదా అనుకునేవారు ఎంత మంది ఉన్నారో తెలీదు కానీ, సాధారణ మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులకు మాత్రం కళ్లు తిరగడం ఖాయం!
ఎక్కడో కొన్ని రాష్ట్రాలలో ఎవరో ఒక్కళ్లిద్దరు అబ్బాయిలు ఎదురు డబ్బిచ్చి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారట అని పేపర్లలోనో, సోషల్‌ మీడియాలోనో చూడడం, చదవడం తప్పితే మన చుట్టుపక్కల ఎక్కడా అలాంటి సంఘటనలు చూడ్లేదు, విన్లేదు. అలా ఎదురు డబ్బిచ్చి కొనుక్కునే వాళ్లు వున్నా, అలాంటి వాళ్లని వేళ్లమీద లెక్కపెట్టొచ్చేమో!
సినిమాల్లో చూపించినట్లు కట్నం వద్దనే కుటుంబాల్ని వింతగా చూడ్డమే కాదు, వాళ్లలో ఏదైనా లోపం వుందేమో అని జంకే రోజులు ఇంకా పోలేదు ఇప్పటికీ. కట్నం ఇచ్చుకునేది లేదు, పుచ్చుకునేది లేదు. సంతకాల పెళ్లిళ్లు, దండలు మార్చుకుని అయిన వారికి చేతనైనంతలో తృప్తిగా కడుపునిండా తినగలిగే భోజనాలు పెట్టుకుని సరదాగా గడిపితే ఎంత బాగుంటుందో! ఇలాంటి ఊహలు ఈ తరం కొంతమంది పిల్లలు అంటుంటే వింటున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అది సాధ్యం కావట్లేదు. కుటుంబాల్లో పరువు ప్రతిష్టలు, ఇంట్లో పెద్దోళ్ల అనవసరపు ఆర్భాటాలు అడ్డొస్తున్నారు ఈ ఊహలకి. వీటన్నింటిని దాటే రోజు ఎప్పటికి వస్తుందో?!
కట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం అని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, వాటి అమలు సరిగా లేనప్పుడు ఆ చట్టాలను తీసుకురావడం కూడా దండగే. అమ్మాయికి కూడా ఆస్తిలో హక్కుంది, వాటా వుంది. ఇంటి పెద్దలే ఆస్తిలో అమ్మాయికి, అబ్బాయికి సమానంగా ఆస్తి పంపకం చేయాలి. సమాన హక్కు అనే చట్టాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. అప్పుడే ఈ కట్నాల గోల కొంచెమైనా తగ్గుతుందేమో!!
– బి.మల్లేశ్వరి

Spread the love