– ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠిన శిక్షకు దేశవ్యాప్త నిరసన
– పలు ప్రాంతాల్లో హైవేల దిగ్బంధం… రాస్తారోకోలు
– నిత్యావసరాల ధరలకు రెక్కలు
– బంకుల్లో నిండుకుంటున్న ఇంధన నిల్వలు
– చర్చలు సఫలం.. సమ్మె విరమణ
న్యూఢిల్లీ : వాహనంతో ఎవరినైనా ఢకొీట్టి, ఆపకుండా వెళ్లిపోయే డ్రైవర్లకు (హిట్ అండ్ రన్) విధించే శిక్షను కఠినతరం చేస్తూ నూతన క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహితలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కేసులలో పది సంవత్సరాల జైలు శిక్ష, ఏడు లక్షల రూపాయల జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కులు, లారీలు, బస్సులు, ట్యాంకర్ల డ్రైవర్లు వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సోమవారం నుండే వీరంతా సమ్మెకు దిగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆందోళన ఉధృతం కాకముందే తగిన చర్యలు తీసుకోవాలంటూ వివిధ రవాణా సంఘాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. సమ్మె కారణంగా పలు పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. అనేక చోట్ల ఇప్పటికే బంకులు మూతపడ్డాయి. ఏ బంకు ముందు చూసినా భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. సమ్మె ఇలాగే కొనసాగితే కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసరాల సరఫరాకు అవరోధం ఏర్పడుతుందని, ఫలితంగా వాటి ధరలు కొండెక్కి కూర్చుంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షాకాలాన్ని పెంచడాన్ని నిరసిస్తూ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ సహా పలు రాష్ట్రాలలో డ్రైవర్లు రోడ్లను, జాతీయ రహదారులను దిగ్బంధించారు. పశ్చిమ బెంగాల్లో వందలాది మంది ట్రక్కు డ్రైవర్లు హూగ్లీ జిల్లాలోని దంకుని టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిని దిగ్బంధించి, రహదారిపై తమ వాహనాలను అడ్డుపెట్టారు. రోడ్లపై టైర్లను తగలబెట్టారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఛైర్మన్ బాల్ మల్కిత్ సింగ్ డిమాండ్ చేశారు. చట్టంలోని కొన్ని అంశాలు వేధింపులకు, దోపిడీకి, అనవసరపు నిర్బంధానికి, చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ పూర్తి అసమంజసంగా ఉంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మాకు కూడా తీవ్ర గాయాలు అవుతాయి. కానీ మా పక్షాన జోక్యం చేసుకోవడానికి ఎవరూ రారు’ అని ఓ ట్రక్కు డ్రైవర్ వాపోయారు. ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్)లో నడిచే ట్రక్కులు, టెంపోలు, కంటైనర్లలో 70% వరకూ ఆగిపోయాయి. ఈ ప్రాంతంలో అనునిత్యం లక్షన్నర వాహనాలు తిరుగుతుంటాయి. భారీ వాహనాలలో 35% వరకూ నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను రవాణా చేస్తుంటాయి. ముంబయిలో ఒక రోజు సమ్మె చేస్తే రూ.120-150 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై 500 మందికి పైగా డ్రైవర్లు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నాలుగు గంటలకు పైగా రహదారి పైనే నిలిచిపోయాయి. నైగార్ ప్రాంతంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. గుజరాత్‌లోని సూరత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, హర్యానాలోని అంబాలా సహా పలు నగరాలలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. పంజాబ్‌లో కనీసం ఏడు లక్షల ట్రక్కులు నిలిచిపోయాయి.
మధ్యప్రదేశ్‌లో పది వేల ట్రక్కులు, బస్సులు, టాక్సీలు ఆగిపోయాయని రవాణా యూనియన్లు తెలిపాయి. సమ్మె కారణంగా ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంధన సరఫరాలకు ఆటంకం కలగడంతో ఇండోర్, బాలాఘాట్, ఉజ్జయిని, రత్లాం, భోపాల్ వంటి పలు జిల్లాలలో పెట్రోలు బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. ధార్‌లో ముంబయి-ఆగ్రా హైవేపై డ్రైవర్లు తమ వాహనాలను నిలిపి, ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. పన్నా వద్ద బస్సు, ట్రక్కు డ్రైవర్లు 39వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. జమ్మూకాశ్మీర్, లఢక్ ప్రాంతాలలో ఇంధనాన్ని సరఫరా చేసే 1,500 ట్యాంకర్లు ఆగిపోయాయి. శిక్షాకాలాన్ని పెంచుతూ తీసుకొచ్చిన నూతన నిబంధనలను ‘చీకటి చట్టం’గా డైవర్లు అభివర్ణిస్తున్నారు. సవరణను ఉపసంహరించే వరకూ ఇంధనాన్ని, నిత్యావసరాలను సరఫరా చేయబోమని స్పష్టం చేశారు. ప్రమాదానికి విధించే జరిమానాను ఏడు లక్షల రూపాయలుగా నిర్ణయించడంపై వారు మండిపడుతూ ‘అంత డబ్బే మా దగ్గర ఉంటే సొంతగా వాహనాన్ని కొనుక్కునే వాళ్లం. డ్రైవర్లుగా ఎందుకు ఉంటాము?’ అని ప్రశ్నించారు.
చట్టం ఏం చెబుతోంది?
భారతీయ న్యాయ సంహిత చట్టం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన శిక్షలు ప్రతిపాదించింది. దీని ప్రకారం…వాహనం ఎవరినైనా ఢకొీట్టినప్పుడు దానిని నడుపుతున్న డ్రైవరు ఆ విషయాన్ని పోలీసులకు లేదా అధికారులకు తెలియజేయకుండా పరారైతే పది సంవత్సరాల జైలు శిక్ష, ఏడు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అయితే ‘నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణమైతే’ అనే క్లాజు కింద శిక్షను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. మొదటి కేటగిరీలో… ఉద్దేశపూర్వకంగా కాకుండా వాహనాన్ని వేగంగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తి మరణానికి కారణమైతే నిందితుడికి ఐదు సంవత్సరాల వరకూ జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఇక రెండో కేటగిరీలో…ఉద్దేశపూర్వకంగా కాకుండా వేగంగా లేదా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు, ఆ సమాచారాన్ని పోలీసు అధికారి లేదా మెజిస్ట్రేట్‌కు తెలియజేయకుండా పరారైతే పది సంవత్సరాల వరకూ జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. అయితే నిందితుడు లేదా డ్రైవరు ప్రమాద సమాచారాన్ని అధికారులకు ఎలా చేరవేయాలన్న విషయంపై మాత్రం చట్టంలో స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా ప్రజలు వాహన డ్రైవర్లపై ఆగ్రహంతో ఉంటారు. అలాంటప్పుడు డ్రైవర్లు స్వయంగా అధికారుల వద్దకు వెళ్లి ఎలా సమాచారం ఇస్తారన్నదే ప్రశ్న. గతంలో ఐపీసీ సెక్షన్ 394-ఏ కింద ఈ తరహా నేరానికి నిందితుడికి రెండేళ్ల వరకూ జైలుశిక్ష విధించే వారు. తాజా చట్టంలో ఆ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
ట్రక్ డ్రైవర్ల సమ్మె విరమణ
హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాద కేసులపై కొత్త చట్టానికి వ్యతిరేకంగా సమ్మెను ట్రక్ డ్రైవర్లు మంగళవారం సాయంత్రం నుంచి విరమించారు. డ్రైవర్లు వ్యతిరేకిస్తున్న కొత్త చట్టం ఇంకా అమల్లోకి రాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డ్రైవర్లతో సంప్రదింపులు జరిపిన తరువాతే కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకుని వస్తామని కేంద్ర హామీ ఇచ్చింది. దీంతో సమ్మెను డ్రైవర్లు విరమించారు. రెండు రోజులగా ట్రక్ డ్రైవర్లు సమ్మె నేపథ్యంలో డ్రైవర్ల ప్రతినిధులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా మంగళవారం సాయత్రం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేంద్రం తరపున పై హామీ ఇచ్చారు.