– మున్సిపల్ ఆఫీస్ టు కలెక్టరేట్
– కలెక్టరేట్ టు మున్సిపల్ ఆఫీస్
– చెప్పులు అరిగేలా తిరుగుతున్న లబ్దిదారులు
– సరైన సమాచారం ఇవ్వని అర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు
– నేడు రెండో విడత ఇండ్ల పంపిణీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉప్పల్ బీరప్పగడ్డకు చెందిన ఓ వ్యక్తి డబుల్ బెడ్‌రూం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొదటి విడతలో ఇల్లు రాలేదు. రెండో విడతలోనైనా వస్తుందేమో అనే ఆశతో మున్సిపల్ ఆఫీసుకు వెళ్లాడు. ‘మాకు తెలియదు.. కలెక్టరేట్‌కు వెళ్లాలని’ మున్సిపల్ అధికారులు సూచించారు. ఆ వ్యక్తి కలెక్టరేట్‌కు వచ్చి అడగ్గా.. ఏమాకు సంబంధం లేదు.. మున్సిపల్ కార్యాలయంలో అడగండి అంటూ సంబంధిత అధికారులు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి మళ్లీ ఉప్పల్ మున్సిపల్ ఆఫీసుకు వెళ్లాడు. వారు మళ్లీ కలెక్టరేట్‌కు పురమాయించారు. ‘మాకు తెలియదు.. మున్సిపల్ ఆఫీసులోనే కనుక్కోండి’ అని కలెక్టరేట్‌లో చెప్పడంతో ఆ అభాగ్యుని కండ్లు బైర్లుకమ్మాయి. ఇంతకి లబ్దిదారులకే ఇండ్లు కేటాయిస్తున్నారా..? లేక బోగస్ వ్యక్తులకు ఇస్తున్నారా..? అని సంబంధిత అధికారులను ప్రశ్నించాడు. ఆ విషయం మున్సిపల్ ఆఫీసులో అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ లబ్దిదారుడు నిరుత్సాహానికి గురయ్యాడు. కాసేపు కలెక్టరేట్‌లోని ఆర్‌అండ్‌బీ అధికారులతో వాగ్వాదానికి దిగి చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయాడు. ఇది ఒక్క బీరప్పగడ్డకు చెందిన లబ్దిదారుడి ఆవేదనే కాదు.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది లబ్దిదారుల పరిస్థితి.
మేడ్చల్-మల్కాజిగిరిలో మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. దమ్మాయిగూడ, దుండిగల్, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, కోంపల్లి, మేడ్చల్, నాగారం మున్సిపాల్టీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్స్ కోసం 14వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ డబుల్ బెడ్‌రూం స్కీంను జిల్లా ఆర్‌అండ్‌బీ డిపార్టుమెంట్‌కు కేటాయించారు. వీరు మున్సిపల్ కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ర్యాండమైజేషన్ ద్వారా మొదటి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున 5 నియోజవకర్గాలకుగాను 2,500 ఇండ్లను కేటాయించి పంపిణీ చేశారు. గురువారం రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 500 చొప్పున మరో 2,500 ఇండ్లను పంపిణీ చేయనున్నారు. అయితే, ఈ విషయంపై లబ్దిదారులకు సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విడత విడతకు నియోజకవర్గంలో 500 మందికి ఇండ్లను కేటాయిస్తుండటంతో తమకు వస్తుందో.. రాదో..? అని వందలాది మంది ఆందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించాల్సిన ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో లబ్దిదారులు కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు.
మున్సిపల్ ఆఫీసు టు కలెక్టరేట్..
దరఖాస్తుదారులు మున్సిపల్ ఆఫీసు టు కలెక్టరేట్.. కలెక్టరేట్ టు మున్సిపల్ ఆఫీసుకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అయినా వారికి సరైన సమాధానం దొరకడం లేదు. ఇటు ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పక.. అటు మున్సిపల్ అధికారులు పట్టించుకోక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రికి ఈ విషయం చెప్పినా స్పందించడం లేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర్యాండమైజేషన్ అని చెబుతున్నా.. అసలైన లబ్డిదారులకే ఇండ్లు కేటాయిస్తున్నారా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా లబ్దిదారులకే కేటాయిస్తే లక్కీ డ్రా అనంతరం లిస్ట్ ప్రకటించొచ్చు కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇండ్ల ఎంపికలో అనుమానాలు ఉన్నాయని, రాజకీయ నాయకులకు చెందిన వారికే కేటాయిస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి.
సమన్వయ లోపం..
అధికారుల సమన్వయ లోపం లబ్దిదారులకు శాపంగా మారుతోంది. జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల విషయంలో కలెక్టరేట్‌లోని జిల్లా ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులకు సమన్వయం లోపం ఉన్నట్టు స్పష్టమవుతోంది.
నేడు రెండో విడత పంపిణీ
గ్రేటర్ హైదరాబాద్‌లోని లబ్దిదారులకు గురువారం రెండో విడత డబుల్ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేయనున్న్నారు. ఈ మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 500 చొప్పున 2,500 ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,500 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు.