ఏ పార్టీలో చేరేదీ హైదరాబాద్‌లో వెల్లడిస్తాం..

– మోసకారి కేసీఆర్‌ను ఇంటికి పంపించేలా నిర్ణయం
– అభిమానుల అభీష్టం మేరకే ముందుకు..: పొంగులేటి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై ఉత్కంఠ వీడే సమయం ఆసన్నమైంది. మరో నాలుగైదు రోజుల్లో తాను ఏ పార్టీలో చేరేది స్పష్టతనిస్తానని పొంగులేటి శుక్రవారం ఖమ్మంలో ప్రకటించారు. స్థానిక ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య అనుచరుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో చేరుతానో చెబుతానని, ఏ పార్టీలో చేరాలనే విషయమై అనుచరులు అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. వేలాది మంది ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశమైన తాను.. వారి అభిప్రాయాలను సేకరించానన్నారు. తనను గేలి చేసిన వాళ్ళు.. చిన్న చూపు చూసినవాళ్లు ఉన్నారని, కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగారని, అయినప్పటికీ అన్నింటిని చిరునవ్వుతోనే స్వీకరించానని తెలిపారు. ఏ నిర్ణయం తీసుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావును, అహంకారపూరిత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవచ్చో అభిప్రాయసేకరణ కోసమే ఇంత సమయం పట్టిందన్నారు. బీఆర్‌ఎస్‌కు వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తాన్నారు.. ఖమ్మం బహిరంగ సభ తేదీలనూ త్వరలోనే వెల్లడిస్తానంటూ తెలిపారు. కేసీఆర్‌ను తండ్రిలా భావించి పార్టీలో చేరితే.. తనను చాలా అవమానించారని, అయినా సహనంతో అన్నింటినీ భరించానన్నారు. కానీ, 2019 లోకసభ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వక పొగా.. తర్వాత ఇస్తానన్న రాజ్యసభ కూడా ఇవ్వలేదని చెప్పారు. కనీసం కలిసి మాట్లాడేందుకూ అవకాశం ఇవ్వలేదని తెలిపారు. కాగా, అనుచరుల సమావేశంలో జై కాంగ్రెస్‌ నినాదాలు మిన్నంటాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనాయకులు, అనుచరుల్లో అత్యధిక మంది కాంగ్రెస్‌లో చేరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ ఒకేసారి కాంగ్రెస్‌ గూటికి చేరతారని సమాచారం. విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మెన్‌ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాయకులు బొర్రా రాజశేఖర్‌, మువ్వా విజరు బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, విజయాబాయి, కోట రాంబాబు, దొడ్డా నగేష్‌, తదితరులు ఉన్నారు.

Spread the love