మా పార్టీ అభ్యర్థులు ఎవరు?

– ఆలోచనలో కార్యకర్తలు
– బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది… మేము ఏం చేయాలి?
– కాంగ్రెస్, బీజేపీ అభిమానుల ప్రశ్న..
నవతెలంగాణ – సిద్దిపేట 
రాష్ట్ర అసెంబ్లీ  నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి సిద్దిపేట జిల్లా తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. మొన్నటిదాకా కాంగ్రెస్,  బీజేపీ పార్టీల అధిష్టానం టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల నుండి దరఖాస్తులను స్వీకరించినన్ని రోజులు జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ ఆశిస్తున్న వారితో కొంత సందడి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్,  హుస్నాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఆపార్టీ శ్రేణులు తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఇంటింటా వాడవాడల ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంకు తూముకుంట నర్సారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.  ఇతర నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అదేవిధంగా బీజేపీ ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు అభిమానులు తాము ఎవరి తరఫున ప్రచారం చేయాలో అనే పాలు పోకుండా … మా పార్టీ అభ్యర్థులు ఎవరు అని ఆలోచనలో పడ్డారు. అధిష్టానం తొందరగా అభ్యర్థులను ప్రకటించాలని కోరుతున్నారు.
 అభ్యర్థులే కీలకం….
జిల్లాలో గతంలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, దుబ్బాకలో మాత్రం బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కాగా సిద్దిపేటలో హరీశ్ రావుపై పోటీ చేసిన వారిలో ప్రత్యార్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ప్రకటించే అభ్యర్థులే కీలకం కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకొని,  సీఎం కేసీఆర్ హుస్నాబాద్, సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభల పేరిట ప్రచారాన్ని నిర్వహించారని, కానీ తమ పార్టీలకు అభ్యర్థులే ప్రకటన కాలేదని,  తాము ఎవరి పేరుతో ప్రచారం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆందోళనలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు….
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు తమ పేర్లు ఇంకా కరారు కాకపోవడంతో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. టికెట్ ఆశిస్తున్న వారు ఇంకా ఎన్ని రోజులు కార్యకర్తల,  నాయకుల వెంబడే తిరగాలనా… ప్రజలలోకి ఎప్పుడు పోవాలి అనే నిరాశలో ఉన్నట్లు సమాచారం. ధైర్యం చేసి ప్రజలలోకి వెళ్లి,  కొంత ఖర్చు పెట్టుకుని ప్రచారాన్ని చేసినా …తీరా చివరికి టికెట్ రాకపోతే ఇటు పరువు పోతుందని, ఆటు ధనం వృధా అవుతుందనే ఆలోచనతో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు పాలు పోనీ స్థితిలో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి పోటీని ఇవ్వాలంటే…. వెంటనే తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు.
Spread the love