పొద్దు తిరుగుడు.. కొనేదెవరు..?

Poddu Tirugudu.. Who will buy it..?– పంట సేకరణకు అనుమతి కోరిన రాష్ట్రం
– ఇంత వరకు స్పందించని కేంద్రం
– మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు రాష్ట్రం నిర్ణయం
– సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో సాగు
– ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
– మద్దతు ధర రూ.6760.. వ్యాపారులు ఇచ్చేది రూ.4200
– తీవ్రంగా నష్టపోతున్న రైతులు
రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. పంట సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరినా.. ఇంతవరకు అటు నుంచి స్పందన లేదు. వెరసి పొద్దుతిరుగుడు పంట సాగు చేసిన రైతులు పంటను అడ్డికిపావుసేరులా విక్రయించాల్సి వస్తోంది. పంటకు సరైన ధర రాకపోయే సరికి తీవ్రంగా నష్టపోతున్నారు. సన్‌ప్లవర్‌ నూనెకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది. విదేశాల నుంచి మనం వంట నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. కానీ..! స్థానికంగా రైతులు పండించే పంటకు మాత్రం మద్దతు ధర ఇవ్వట్లేదు. మద్దతు ధర, మార్కెట్‌ సదుపాయం, కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేని కారణంగా ఎక్కువగా రైతులు పొద్దుతిరుగుడు పంట సాగుకు ఆసక్తి చూపట్లేదు. వాణిజ్య పంటల కొనుగోలు విషయంలో కేంద్రం ముందుకు రాకపోవడంతో రైతులు పంట మార్పిడికి ఇష్టపడట్లేదు. ప్రస్తుతం సాగైన పంట చేతికొస్తున్నందున వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. ఒకే రకమైన పంట పదే పదే సాగు చేయడం వల్ల దిగుబడులు రాకపోవడమే కాకుండా భూసారం దెబ్బతిని చీడపీడల వల్ల పంట నష్టమేర్పడుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్న మాట. పంట మార్పిడి అనివార్యమని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ కాలంలో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు లాభసాటి అని చెబుతున్నారు. అందులో భాగంగానే నూనె గింజల పంటలైన పొద్దుతిరుగుడు వైపు రైతులు మళ్లుతున్నారు. రాష్ట్రంలో సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, కామారెడ్డి ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట అధికంగా సాగవుతోంది. ఈ యాసంగి సీజన్‌లో 21350 ఎకరాల్లో పంట సాగైంది. అందులో సిద్దిపేట జిల్లాలో 8424 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 380 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 370 ఎకరాలు, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 12176 ఎకారల్లో పొద్దు తిరుగుడు పంట సాగైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
పొద్దుతిరుగుడు వైపు రైతుల దృష్టి
వరి సాగుకు నిరంతరం నీటి పారకం ఉండాలి. పత్తినేమో ఖరీఫ్‌లోనే వేస్తారు. దీంతో యాసంగి సీజన్‌లో స్వల్పకాలిక పంటల సాగు అనుకూలంగా ఉంటుంది. నీటి వనరులు తక్కువగా ఉన్న ఎర్రచెల్క, ఇసుక, ఒండ్రు మట్టి నేలల్లో పొద్దుతిరుగుడు పైరు పెరుగుతుంది. నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 30లోపు పొద్దుతిరుగుడు విత్తనాలు విత్తుకుంటే 90 నుంచి 95 రోజుల్లో పంట దిగుబడి చేతికొస్తుంది. 10-15 రోజులకోసారి నీటి తడి పెడితే సరిపోతున్నందున రైతులు పొద్దుతిరుగుడు సాగు వైపు మళ్లుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మాత్రం మద్దతు ధర, మార్కెట్‌ సదుపాయం కల్పించడం లేదు. సర్కార్‌ నుంచి ఎలాంటి సాయమూ అందకపోయే సరికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతులు పొద్దు తిరుగుడు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, మొక్కజొన్న, మిరప, కూరగాయలు, పూలు, పండ్ల తొటల్ని సాగు చేస్తున్నారు. అయితే, వాణిజ్య పంటల దిగుబడుల్ని విక్రయించేందుకు స్థానికంగా మార్కెట్‌ సదుపాయం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పంట సేకరణకు అనుమతివ్వని కేంద్రం
రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు చేస్తున్న రైతుల నుంచి పంట సేకరణకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పొద్దుతిరుగుడు సాగు విస్తీర్ణం, చేతికి రానున్న పంట దిగుబడులు, మద్దతు ధర పెంపు గురించి ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి ఇంత వరకు అనుమతి రాలేదు. కానీ, పంట దిగుబడులు చేతికి వస్తుండటంతో కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేశారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పందించి కేంద్రం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా మార్క్‌ఫెడ్‌ ద్వారా పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. తొలుత సిద్దిపేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని, ఆ తర్వాత మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌ ఇతర ప్రాంతాల్లోనూ అవసరాల మేరకు కొనుగోలు కేంద్రాల్ని పెట్టనున్నారు.
మద్దతు ధర దక్కక..
కేంద్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు పంట సేకరణ కోసం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొద్దుతిరుగుడు పంట క్వింటాల్‌కు ఎంఎస్‌పీ ధర రూ.6760 ఉండగా.. వ్యాపారులు మాత్రం రూ.4200కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్ని పెట్టి పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల ఒక్కో క్వింటాల్‌కు రూ.2500 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా పొద్దుతిరుగుడు సాగైంది. ముందస్తుగా పంట వేయడం వల్ల దిగుబడులు వస్తున్నాయి. పంటను వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధర పెంచాలి శెట్టిపల్లి సత్తిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి
పొద్దుతిరుగుడు దిగుబడుల్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాల్ని పెట్టాలి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పొద్దుతిరుగుడు సాగు పెరుగుతోంది. నూనె గింజల పంటకు మద్దతు ధర పెంచాలి. స్థానికంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెట్టకపోవడం వల్ల ఇప్పటికే రైతులు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకున్నారు. సాగు విస్తీర్ణం ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టాలి.

Spread the love