కాళేశ్వరం గేట్లు పాడవడానికి కారణమెవరో సమాధానం చెప్పాలి

కాళేశ్వరం గేట్లు పాడవడానికి కారణమెవరో సమాధానం చెప్పాలి– కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్‌ సవాల్‌
– తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం గేట్లు పాడవడానికి కారణం ఎవరో సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , ఎమ్మెల్యే కేటీఆర్‌కు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పడానికి కేటీఆర్‌కు బుద్ధి ఉండాలని అన్నారు. శనివారం నాడిక్కడ నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ చైర్మెన్‌ అధ్యక్షతన తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్ధాయి సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు రాలేదని, కానీ మొత్తం తెలంగాణకే నీళ్లు అందించామంటూ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఏ పరీక్షలు చేయకుండానే బ్యారేజీలు కట్టారని, ఏ బ్యారేజీలో కూడా 3-4 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నిల్వ పెట్టరని అన్నారు.
తుమ్మిడిహెట్టి దగ్గర తమ ప్రభుత్వం ప్రాజెక్టు కట్టి తీరుతుందని, ప్రస్తుతం ఉన్న కాళేశ్వరం అలాగే ఉంటుందని అన్నారు. గ్రావిటీతో నీళ్లు తీసుకొచ్చేలా ప్రాజెక్టు రూపొందిస్తామని చెప్పారు. నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లతోనే మరమ్మతులు చేయిస్తున్నామని, ప్రభుత్వం ఈ పనులకు మళ్లీ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టదని తెలిపారు. అన్నారం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున సీపేజీ ఉందని, సుందిళ్లలో కూడా లోపాలు ఉన్నాయని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచించిందని అన్నారు. ఐదేండ్లలో సుమారు 65 టీఎంసీలు పంప్‌ అయ్యాయని, సంవత్సరానికి 13 టీఎంసీలు మాత్రమే అని తెలిపారు. ప్రచారం కోసమే కాళేశ్వరాన్ని వాడుకున్నారని విమర్శిం చారు. తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్‌ ఖర్చు చాలావరకు తగ్గేదని అన్నారు. ఇప్పుడు ఏడాదికి రూ.10 వేల కోట్లు విద్యుత్‌ చార్జీలకే పోతుందని పేర్కొన్నారు. వడ్డీలు రూ. 10 వేల కోట్లు, విద్యుత్‌ ఖర్చు మరో రూ. 10 వేల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. కేసీఆర్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టు, వాళ్ళ హయాంలోనే కూలిందని విమర్శించారు. ప్రాజెక్టుపై కేసీఆర్‌ 40 రోజులు మౌనంగా ఉన్నారని, ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు.
డ్యామ్‌ సేఫ్టీ సూచనల మేరకే ముందుకు వెళ్తామని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన టెస్టులు, పనులు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై డ్యామ్‌ సేఫ్టీ అధికారులతో చర్చించామని అన్నారు. చాలా వరకూ డ్యామ్‌ సేఫ్టీ సూచనలను అమలు చేశామని పేర్కొన్నారు. సోమవారం మరోసారి భేటీ అవుతున్నామని చెప్పారు. మూడు బ్యారేజీల్లోని గేట్లని ఎత్తి నీళ్లు కిందకు వదిలేయాలని లిఖితపూర్వకంగా డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచించిందని, ఆ పనులు జరుగుతున్నా యని అన్నారు. అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలని, బీఆర్‌ఎస్‌ దోపిడీ విధానాలతోనే లోపాలు జరిగాయని అన్నారు. డ్యామ్‌ సేఫ్టీ అధికారులకు కెటిఆర్‌ కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందని భావిస్తున్నామని, నాశనం చేసినా వారే సలహాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌, కెటిఆర్‌ ల ఉచిత సలహాలు అవసరం లేదని అన్నారు. సాంకేతిక కమిటీ నిపుణుల సలహాల మేరకే ముందుకు వెళ్తామని అన్నారు. సమావేశంలో జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మెన్‌ అనిల్‌ జైన్‌, ఎన్డీఎస్‌ఎ ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర సలహాదారు ఆధిత్యనాథ్‌ దాస్‌, ఐఏఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జ, ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సి. నాగేశ్వరరావు, కాళేశ్వరం సీఈ సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love