అక్క.. ఎవరు?

అక్క.. ఎవరు?భారతీయ సినీ పరిశ్రమలో పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించు కున్న ప్రొడక్షన్‌ హౌస్‌ యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌. ఈ సంస్థ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది.
సీట్‌ ఎడ్జ్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనుంది. చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న నటీమణులు కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
‘మన చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే వంటి నటీమణులు ఉండటం అనేది మనకు ఓ బహుమానంగా చెప్పొచ్చు. వారు సహజ సిద్ధమైన నటనతో మెప్పిస్తారు. వారి అద్భుతమైన నటనతో ప్రశంసలను పొంది తద్వారా తమదైన క్రేజ్‌ను వారు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పోటా పోటీగా నటించే వీరిద్దరూ కలిసి ‘అక్క’ అనే స్ట్రీమింగ్‌ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. ఇదే ఇప్పుడు ట్రేడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది’ అని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్‌ శెట్టి అనే డెబ్యూ డైరెక్టర్‌ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. ‘అక్క’ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్‌ విజన్‌ని గుర్తించిన ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను వైఆర్‌ఎఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Spread the love