– టైటాన్స్, ఇండియన్స్ క్వాలిఫయర్ 2 నేడు
– అమీతుమీకి సిద్ధమైన హార్దిక్, రోహిత్
– రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
చెన్నై సూపర్‌కింగ్స్ పిలుస్తోంది!. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు సూపర్‌కింగ్స్ ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకోగా.. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఐదుసార్లు విజేత ముంబయి ఇండియన్స్ మరో బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. తొలిసారి గుజరాత్ టైటాన్స్ ఒత్తిడి ఎదుర్కొంటుండగా, సరైన సమయంలో సమిష్టిగా దంచికొడుతున్న ముంబయి ఇండియన్స్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్ 2 పోరు నేడు. టైటాన్స్, ఇండియన్స్ మ్యాచ్‌లో విజేత టైటిల్ కోసం ఫైనల్లో సూపర్‌కింగ్స్‌తో పోటీపడనుంది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
గుజరాత్ టైటాన్స్ తొలిసారి ఓటమి భయం పట్టగా, ముంబయి ఇండియన్స్ సహజశైలిలో ప్లే ఆఫ్స్‌లో అదరగొడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ గత సీజన్లో, తాజా సీజన్లో ఎప్పుడూ తప్పక నెగ్గాల్సిన పరిస్థితిని ఎదుర్కొలేదు. లీగ్ దశలో మెరిసినా.. క్వాలిఫయర్ 1లో చతికిల పడింది. సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి టైటాన్స్‌ను ఆత్మరక్షణలోకి నెట్టింది!. లీగ్ దశ చివర్లో పుంజుకున్న ముంబయి ఇండియన్స్ కలిసికట్టుగా చెలరేగుతుంది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఆరుసార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ముంబయి ఇండియన్స్.. ప్రియ ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఎదుర్కొనేందుకు ఎదురు చూస్తుంది. గుజరాత్ టైటాన్స్ సైతం సొంత మైదానంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధం కావాలని తపిస్తోంది. అటు టైటాన్స్, ఇటు ఇండియన్స్ తొలుత ముఖాముఖి పోరులో తేల్చుకోవాల్సి ఉంది. ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ నేడు క్వాలిఫయర్ 2లో చావోరేవో తేల్చుకోనున్నాయి.
జోరుమీదున్న ముంబయి :
ఐదుసార్లు చాంపియన్ ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయింది. బుమ్రా గాయంతో దూరం కావటం, ఆర్చర్ సేవలు పూర్తిగా అందుబాటులో లేకపోవటంతో డెత్ ఓవర్లలో ప్రధాన సమస్య ఎదుర్కొంది. నయా సంచలనం ఆకాశ్ మధ్వాల్ ముంబయి డెత్ బౌలింగ్ కష్టాలకు చెక్ పెట్టాడు. ఎలిమినేటర్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు ఫామ్‌లోకి రావటంతో ముంబయి ఇండియన్స్ నేడు ఫేవరేట్‌గా కనిపిస్తుంది. కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్‌లు ధనాధన్ ఊపు మీద ఉన్నారు. ఈ ఇద్దరిని అడ్డుకోవటం టైటాన్స్‌కు అంత సులువు కాదు. యువ బ్యాటర్లు తిలక్ వర్మ, నేహల్ వదేరా, టిమ్ డెవిడ్‌లు జోరందుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో జేసన్ బెహాన్‌డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్, పియూశ్ చావ్లాలు వికెట్ల వేటలో కదం తొక్కుతున్నారు. లీగ్ దశ తొలి పది మ్యాచుల్లో పవర్‌ప్లేలో 9.2 ఎకానమీ, 54.9 సగటు నమోదు చేసిన ముంబయి బౌలర్లు.. చివరి ఐదు మ్యాచుల్లో 8.2 ఎకానమీ, 27.3 సగటుతో రాణించారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ సైతం పరుగుల వరద పారిస్తే ముంబయి ఇండియన్స్‌కు ఎదురుండదు.
ఒత్తిడిలో టైటాన్స్
ఐపీఎల్‌లో ఆడుతున్నది రెండో సీజనే అయినా.. గుజరాత్ టైటాన్స్‌కు ఒత్తిడి తెలియదు!. రెండు సీజన్లలోనూ లీగ్ దశలో దుమ్మురేపిన టైటాన్స్ ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేసింది కానీ ఎన్నడూ ఆత్మరక్షణలో పడలేదు. క్వాలిఫయర్ 1 ఓటమితో గుజరాత్ టైటాన్స్‌కు ఒత్తిడిని పరిచయం చేసింది సూపర్‌కింగ్స్. దీంతో తుది జట్టు కూర్పుపైనా టైటాన్స్ ఇప్పుడు తికమక పడుతుంది. ఛేదనలో తిరుగులేని టైటాన్స్ చెన్నైలో లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడింది. శుభ్‌మన్ గిల్ వరుస శతకాల ఫామ్ సైతం టైటాన్స్‌ను కాపాడలేదు. డెవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియ వైఫల్యం టైటాన్స్‌ను కలవరానికి గురి చేస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య నం.3 స్థానంలో పరుగులు సాధిస్తున్నాడు, కానీ నం.4 స్థానంలో ఇబ్బంది పడుతున్నాడు. వృద్దిమాన్ సాహా, సాయి సుదర్శన్‌లు సైతం రాణించాల్సిన అవసరం ఏర్పడింది. విజరు శంకర్ ఫామ్‌లో ఉండటం టైటాన్స్‌ను సానుకూలత. రషీద్ ఖాన్, మహ్మద్ షమిలతో కూడిన బౌలింగ్ దళం టైటాన్స్‌కు గొప్ప బలం. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, జోశ్ లిటిల్‌లు ఆ ఇద్దరికి చక్కగా సహకారం అందిస్తున్నారు. సొంతగడ్డపై ఆడుతున్న సానుకూలతతో గుజరాత్ టైటాన్స్ నేడు ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించాలని భావిస్తోంది. శుభ్‌మన్ గిల్, డెవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, మహ్మద్ షమి టైటాన్స్‌కు కీలకం కానున్నారు.
పిచ్, వాతావరణం
అహ్మదాబాద్‌లో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉష్ణోగ్రత 43 డిగ్రీలు తాకింది. పిచ్‌పై పగుళ్లు ఏర్పడకుండా పూర్తిగా కవర్లు కప్పి ఉంచారు. లీగ్ దశలో ఎక్కువగా వాడని పిచ్‌ను నేడు క్వాలిఫయర్‌కు వినియోగిస్తున్నారు. క్యూరేటర్ పిచ్‌పై బాగా నీళ్లు చల్లారు. దీంతో ఆరంభంలో పేసర్లకు సైతం అనుకూలత ఉండనుంది. మంచు ప్రభావం ఈ వేదికపై పెద్దగా ఉండబోదు. పరుగుల పండుగ కోసం తయారు చేసిన పిచ్‌పై సైతం మంచి బౌన్స్, పేస్ లభిస్తాయని క్యూరేటర్ తెలిపారు. టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (12 అంచనా) :
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (కెప్టెన్), విజరు శంకర్, డెవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, జోశ్ లిటిల్, మోహిత్ శర్మ, మహ్మద్ షమి.
ముంబయి ఇండియన్స్ : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డెవిడ్, నేహల్ వదేరా, క్రిస్ జోర్డాన్, పియూశ్ చావ్లా, జేసన్ బెహన్‌డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ.