జగిత్యాలలో ఎవరికి కలిసొచ్చేను?

– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోరు
– నియోజకవర్గంపై దృష్టి పెట్టిన ఎమ్మెల్సీ కవిత
– బీజేపీ అభ్యర్థిత్వంపై కానరాని స్పష్టత
నవతెలంగాణ- జగిత్యాల
జగిత్యాల నియోజకవర్గంలో ఈ సారి ఏ పార్టీకి కలిసి వస్తుందోనని ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మరోసారి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. బీజేపీ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా స్పష్టత కానరావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ప్రకటించకపోయినా ఆయనే బరిలో నిలిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్‌ తరుపున ఆయన ఒక్కరూ మాత్రమే నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్నారు. .జగిత్యాల నియోజకవర్గం నుంచి 1983లో జీవన్‌రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన 1985 కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గొడిశెల రాజేశంగౌడ్‌ చేతిలో ఓడిపోయాడు. జీవన్‌రెడ్డి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, 1994లో ఓడిపోయి 1996 ఉప ఎన్నికలో విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. గత ఎన్నికల్లో ఆయన ఇదే నా చివరి పోటీ అని ప్రకటించారు. కానీ కాంగ్రెస్‌ తరపున మరో అభ్యర్థి లేకపోవడంతో ఈసారి కూడా ఆయనే బరిలో నిలువనున్నారు.
డాక్టర్‌ సంజరుకుమార్‌ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. మళ్లీ 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవన్‌ రెడ్డిపై విజయం సాధించారు. ఒకసారి ఓడిపోయిన సానుభూతితో పాటు, జగిత్యాలలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని అప్పటి ఎంపీ కవిత, సంజరుకుమార్‌ తరుపున విస్తృత ప్రచారం చేసి చేశారు.
కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తెలిసినా, బీజేపీ నుంచి స్పష్టత లేదు. 2018లో బీజేపీ నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి పార్టీ నలు గురు దరఖాస్తు చేసుకున్నారు.అయితే మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణికి టికెట్‌ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.
నియోజకవర్గంపై కవిత దృష్టి..
2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజరుకమార్‌ గెలుపునకు కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మరోసారి జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇటివల కేంద్రంలోని మ్యాగో మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అంత ేకాకుండా ఎమ్మెల్సీ కవిత సంజరుకుమార్‌ తరుపున ప్రచారంలో పాల్గొంటారని బీఆర్‌ఎస్‌ వర్గాలో చర్చ జరుగుతోంది. ఈ సారి నియోజకవర్గంలో ప్రధా నంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే తీవ్ర పోటీ కనిపిస్తోంది.

Spread the love