సీఎం అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరి పేరు ప్రకటించిన నాకు ఆమోదమే: ఉత్తమ్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏఐసీసీ చీఫ్​తో ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ దిల్లీలో భేటీ అయ్యారు. మరికాసేపట్లో సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఉన్న వారిలో సీఎం ఎవరవుతారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సీఎంగా ఎవరి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించినా తనకు ఆమోదమేనని తెలిపారు. దిల్లీ వెళ్లిన ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖరారు చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగానూ గెలుపొందిన నేపథ్యంలో ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. అయితే అది ఎప్పుడనేది త్వరలో నిర్ణయించి వెల్లడిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Spread the love