చుట్టూ మనుషులున్నా కొందరిని ఒంటరితనం వేధిస్తుంటుంది. దాన్ని అధిగమించేందుకు కొందరు సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తుంటారు. అయినా ఏకాకిగా ఉన్నామనే భావన వారిని వెంటాడుతూనే ఉంటుంది. అమ్మాయిల్లో అయితే ఈ ధోరణి మరింత అధికంగా ఉంటుంది. ఇంతకీ ఆన్‌లైన్ బంధాలు మనల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తున్నాయా లేక మనల్ని మరింత ఏకాకిని చేస్తున్నాయా? కొన్ని సర్వేలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం….
ఒంటరి తనం నుండి బయట పడేందుకు అమ్మాయిలు సోషల్ మీడియా పై ఆధారపడుతున్నారా అనే దానిపై భిన్నరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఏడు నుంచి పదేండ్ల లోపు ఉన్న పిల్లల్లో 15 శాతం మంది ఆన్‌లైన్‌లో ఉన్నా ఒంటరిగానే ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. 11 నుంచి 16 ఏండ్లలోపు ఉన్న వారూ ఇదే చెబుతున్నారు.
స్నేహితులతో వున్నా…
18 ఏండ్ల కేట్ రోబెర్ట్స్… గర్ల్‌గైడింగ్ వెల్లడించిన సర్వే అంశాలపై స్పందిస్తూ ”మహిళలు, అమ్మాయిల్లో ఒంటరితనం తీవ్ర సమస్యగా ఉందన్న విషయాన్ని ఈ సర్వే చెబుతోంది. నిత్యం స్నేహితులతో ఉండే అమ్మాయిలు కూడా ఒంటరిగానే ఉన్నట్లు ఫీలవుతున్నారు. తమ స్నేహితులు బయటకు వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో చూసి తాము వారితో వెళ్లలేదనే భావనతో ఒంటరితనం ఆవహించినట్లు భావించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి కారణాల వల్ల అమ్మాయిలు తాము ఏకాకులం అని మథనపడే స్థితికి చేరుకుంటున్నారు” అని చెప్పారు.
ఒంటరివాళ్లమనే భావనతో...
ప్రతి ముగ్గురిలో ఒకరు కొన్నిసార్లు ఏకాకిగా ఉన్నట్లు ఫీలయ్యామని చెప్పారు. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే తాము ఎక్కువగా ఒంటరివాళ్లమనే భావనలో ఉన్నారు. కొంతమంది తమ ఒంటరితనాన్ని కప్పిపుచ్చు కునేందుకు సోషల్ మీడియాను వాడుతున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలు కూడా ఒంటరితనంతో బాధపడుతున్నట్లు చైల్డ్‌లైన్ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు వారు సహాయం కోరుతున్నారని పేర్కొంది.
ఒంటరితనానికి కారణం ఏంటి?
యువత ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. యువతి అయినా యువకుడైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటే దానికి ఆన్‌లైన్‌కు వెళ్లడం ఒక్కటే కారణం కాదని గర్ల్‌గైడింగ్ తన సర్వే వివరాల ఆధారంగా పేర్కొంది. ఒంటరిగా ఉన్నట్లు అనిపించడానికి అనేక కారణాలున్నాయని అమ్మాయిలు చెబుతున్నారు. మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం, తమ భావాలను ఎవరూ అర్థంచేసుకోకపోవడం, స్నేహితులు దొరకడం కష్టంగా మారడం, బయటకు వెళితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఇంట్లోనే ఉండటం
ఒంటరితనాన్ని అధిగమించేదెలా
ఇటీవల నిర్వహించిన సర్వేలో చాలా మంది మహిళలు ఒంటరితనాన్ని జయించడానికి ఆన్‌లైన్‌కి వెళ్లడం ఒక్కటే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.
ఇతర వ్యాపకాలతో…
7 నుంచి 10 ఏండ్ల మధ్యనున్న బాలికలను సర్వే చేసినప్పుడు స్నేహితులతో మాట్లాడటం ద్వారా ఒంటరి తనం నుంచి బయటపడుతామని చెప్పారు. ఇంట్లోవాళ్లతో మాట్లాడటం, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, ఆటలు, చిత్రలేఖనంలాంటి వ్యాపకాలతో తాము ఏకాకిగా ఉన్నామనే భావనను తొలగించుకుంటామని చాలా మంది అమ్మాయిలు చెప్పారు.
ఆన్లైన్ స్నేహాల వల్ల
కొంతమంది సామాజిక మాధ్యమాలు మమ్మల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తున్నాయని అంటుంటే మరికొందరు మాత్రం ఆన్‌లైన్ స్నేహాలు మమ్మల్ని మరింత ఒంటరిని చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి పలు సర్వేలు యువత.. అందులోనూ ముఖ్యంగా అమ్మాయిలు ఒంటరితనంతో బాధపడుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ సంస్థ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో ప్రతి పది మందిలో ఒకరు (10 నుంచి 24 ఏండ్ల మధ్యనున్న అమ్మాయిలు) ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తెలిపింది.