విమోచనే అయితే నిజాంకు గవర్నర్‌గిరీ ఎందుకిచ్చినట్టు?

Why did Nizam get governorship if it was redemption?ప్రపంచంలో ప్రతి ఏడు సెకండ్లకు ఒక బాలింత లేదా శిశువు మరణిస్తున్నదట. ప్రతి 16 నిమిషాలకు భారతదేశంలో ఒక మానభంగం రిపోర్ట్‌ చేయబడుతున్నదట. విద్యార్థులు, స్త్రీలు, ఆర్థిక దోపిడీకి గురైన వారి బలవన్మ రణాలు భారత్‌లాంటి సబ్‌ సహారా దేశాలలో చాలా ఎక్కువట. మతాలకతీతంగా మూఢనమ్మకాలు ఈదేశాలలోనే ఎక్కువట… ఈ గణాంకాలన్నీ ఐక్యరాజ్యసమితి ప్రకటించినవే అయినప్పటికీ అవి ప్రస్తుతిస్తే అది చాలామందికి జీర్ణం కావడం లేదు. ”నా దేశం గొప్పది, నా మతం పవిత్రమైనది, నా సంస్కృతి పురాతనమైనది, నా చరిత్ర మొత్తం విజయాలతో నిండి ఉన్నది” అని ప్రస్తుతిస్తే ముదమానందమవుతుంది… ఫలానా మతం వల్ల ప్రమాదం ఉన్నది, ఫలానా దేశం వల్ల శత్రుత్వం ఉన్నది, ఫలానా నాయకుడి వల్లనే నేడు సురక్షితంగా ఉన్నామంటూ చెబితే మీసం మేలేసేంత గర్వం తోణికసలాడుతోంది… ఇలాంటి ఆధిపత్య భావజాలం భావితరాలను అగాధంలోకి పడేస్తుందా, లేక అభివృద్ధి పథంలో నడిపిస్తుందా? చరిత్రను పూర్తి వివాదాస్పదం చేసి మన సంస్కృతి మాత్రమే గొప్పదని ప్రచారం చేస్తూ, గడిచిన పాలనంతా స్వార్థపూరితమని, తాను మాత్రమే నిజాయితీపరుడినని నమ్మిస్తూ రాజకీయపబ్బం గడుపుతున్న వారి తప్పు ఎంతనో గానీ, గుడ్డి నమ్మకం నషాళానికెక్కితే విషయమేదైనా వైషమ్యం కాక మరేమవుతది? సంస్కృతిక చారిత్రక అంశాలను వివాదాస్పదం చేసి సామాన్యుల మనోభావాలతో చెలగాటమాడుతూ దావానలంలా విశ్వవ్యాప్తమవుతున్న కలవరపెట్టే రాజకీయ వాతావరణంలో ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది.
నెహ్రూను పక్కనపెట్టి… పటేల్‌ను ఎత్తుకుని…
నేటి భారత ప్రధాని రష్యా యుక్రెయిన్‌ యుద్ధానికి దూతగా వ్యవహరిస్తున్నాడంటే నమ్ముతున్నారు, అమెరికా పార్లమెంటునే శాసిస్తున్నాడంటే నమ్ముతున్నారు, శ్రీలంక ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నాడంటే నమ్ముతున్నారు, ఇస్రో విజయాలు సాధిస్తుందంటే ఆయనకే క్రెడిట్‌ ఇవ్వడానికి తహతహలాడుతున్నారు, కానీ హైదరాబాద్‌ సంస్థా నాన్ని భారతదేశంలో విలీనం చేసింది ఒక నాటి ప్రధానమంత్రి నెహ్రూ అంటే నమ్మలేరు… ఆ నాటి ఘనతను మాత్రం హోంమంత్రి సర్దార్‌ పటేల్‌కు ఇవ్వటానికి ఉబలాటపడతారు! ఇదేం పోకడీ ఇండియన్‌ ఎయిర్‌ బేస్‌ ‘పఠాన్‌ కోట్‌’ వద్దకు వచ్చి భారత సెక్యూరిటీని చంపింది ప్రస్తుత ప్రధాని ఆధ్వర్యంలోనే అని, పుల్వామా ఘటనలో యాభై మంది వరకు జవాన్ల ప్రాణాలు పోయింది ఈయన నిర్లక్ష్యం వహించడం వల్లే అని, గల్వాన్‌ లోయలో పాతికమంది సైనికులు ప్రాణత్యాగం చేసింది ఈయన ఆధ్వర్యంలోనే అని, అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల లక్షల మంది నిరాశ్రయులుగా మారి, వేల మంది ప్రాణాలు కోల్పోయింది ఈయన ఆధ్వర్యంలోనే అని, కార్గిల్‌ యుద్ధం కూడా వీరి డిఎన్‌ఎ గలవారి పుణ్యమమేనని ఎవరైనా చెబితే అవి కొన్ని ఘటనలు మాత్రమే అని కొట్టిపారేయడానికి సోషల్‌ మీడియా వేదికల్లో ముఖ్యంగా వాట్సాప్‌ మహమ్మారితో సిద్ధంగా ఉన్నారు మనవాళ్లు! మన కండ్ల ముందే జరిగిన ఈ సంఘటనలను మరిపిస్తూ దాయాదులపై రెచ్చగొట్టేలా ‘పార్టిషన్‌ హర్రర్స్‌’ అంటూ ఆగస్టు 14న దేశ విభజన గాయాలను ఇంటింటా ప్రదర్శనకు పెట్టినది దుర్నీతి కాదా? ఇలా సామాన్య ప్రజలతో అసత్యాలను నమ్మించే వారిది కుటీలత్వమా లేక ప్రజలే తప్పు మార్గంలో ఉన్నారా?కాశ్మీరు భారత్‌లో విలీనమైన సందర్భంలో జరిగిన ఒప్పందా లన్నింటికీ నెహ్రూని బాధ్యుడిని చేయడానికి ఇష్టపడే వారు హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేసింది ఆయనే అంటే ఇష్టపడరు! ఇదెక్కడి న్యాయం?
భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే సభలు
పైన పేర్కొన్న వైషమ్యాలకు నెలవైన వైతాళికుల కుతంత్రాలతో సెప్టెంబర్‌ 17వ తారీఖు కోసం ప్రతి సంవత్సరం వివిధ రాజకీయ సమూహాలు ఛితిని పేరుస్తూనే ఉంటాయి. రకరకాల ఆజ్యాలను పోసి, వెలిగించిన అగ్ని కీలలను ఎగదోసి, అనేక హదయాలను కొల్లగొట్టాలన్నదే వారి అభిమతం.ఇలాంటి కుతంత్రాలను తెలంగాణ ప్రజలు ఎక్కువమంది నమ్మక పోయినప్పటికీ ఎప్పటికైనా ఇలాంటి ప్రచారం పెను ప్రమాదమే. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైనప్పటికీ దానిని హైదరాబాద్‌ సంస్థాన ‘విమోచన’గా బీజేపీ ప్రచారం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా హైదరాబాద్‌ సంస్థాన విలీన దినోత్సవాన్ని వివాదాస్పదం చేసి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టే ప్రయత్నం చేశారు.ఇప్పుడు బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా ఈ అంశాన్ని మరింత వివాదాస్పదం చేస్తూ సెప్టెంబర్‌ 17న పది లక్షల మందితో పెద్ద సభను నిర్వహించాలని తలపెట్టింది.అంతకు మించిన స్థాయిలో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి బీజేపీ గత పది సంవత్సరాల నుండే ప్రయత్నం మొదలెట్టింది. ఈ సంవత్సరం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను పిలిపించి పెద్ద ఎత్తున సభ నిర్వహణకు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి నాయకులెవరు వచ్చినా, సందర్భ మేదైనా, ముస్లిం వ్యతిరేక భాషణలిచ్చి వెళతారు. ఇంతకీ హైదరాబాద్‌ వీలీనం సందర్భంగా జరిగిన దాష్టీకం ఎలాం టిది? జరిపిందెవరు? సలిపిన పోరాటం ఎవరిది?పొందిన ఫలితం ఎలాంటిది…ఈ వాస్తవాలన్నీ మరుగునపడి పోయి హైదరాబాద్‌ సంస్థాన విలీనం ఒక హిందూ ముస్లిం గొడవగా తేల్చే కుటిలత్వపు ప్రయత్నాలను అడ్డుకోవాలి.
విలీనం చేసినందుకు నిజాంకు ‘గవర్నర్‌గిరీ’
1927లో సాంస్కృతిక అంశాల నేపథ్యంతో ఏర్పడిన రజాకారుల వ్యవస్థ అంచలంచెలుగా ఎదిగి, ఇస్లాం మతానికి తామే ప్రతినిధులమనే స్థాయికి చేరుకొని, నిజాం ప్రభువు ఆదేశాలతో, భూస్వాముల అండదండలతో సామాన్య ప్రజానీకంపై రెండు దశాబ్దాలకు పైగా జరిపిన దాడి అంతా ఇంతా కాదు. ఈ రజాకార్ల వ్యవస్థను వారి దాడులను నేడు మతతత్వ ముసుగు తొడుక్కున్న వారి పూర్వీకులు ఎవరు ప్రశ్నించిన పాపానపోలేదు. రజాకార్ల సైన్యాన్ని వినియోగించుకుని భూస్వాములు, పెత్తందారులు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను వెట్టిచాకిరీలుగా మార్చి దోచు కుంటున్న రోజుల్లో ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించిన కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 1946లో తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పడింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్‌ సంస్థాన విలీనంతో ముగియ లేదు. దానిని, నిజాం అండదండలతో మదమెక్కిన భూస్వాములను, తుద ముట్టించేంతవరకు అనగా 1951 వరకు కొనసాగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి బెంబేలెత్తి వణుకుతున్న ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ హైద రాబాద్‌ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసుకున్న తర్వాత ఆయనకు గవర్నర్‌ హోదా కల్పించి మరీ ఆనాటి ప్రభుత్వం గౌరవించింది. కానీ జమీందారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం ముందుకు రాలేదు. అయినప్పటికీ అనేకమంది సాయుధ పోరాటం జరిపి ప్రజలకు విముక్తి కల్పించారు. కాశ్మీరులో ఆర్టికల్‌ 370 ద్వారా రాష్ట్ర ప్రజలకు, భౌగోళిక కారణాల వల్ల ఏర్పడిన వెనుకబాటు తనానికి రక్షణ కవచంగా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తే, ప్రజలను హీనంగా హింసించి తెలంగాణ వెనుకబాటుతనానికి కారకుడైన హైదరాబాద్‌ నిజాంకు వ్యక్తిగత హోదాగా గవర్నర్‌ గిరిని ఇచ్చి గౌరవించుకుంది ఆనాటి ప్రభుత్వమే. విమోచన అంటే… ‘చెర నుండి విడిపించడం’ మరి నిజాం చెర నుండి విమోచన కల్పించిన తర్వాత నిజాంకు గౌరవం ఎలా దక్కింది? ఈ మాత్రం సూక్ష్మాన్ని ప్రజలు అర్థం చేసు కోలేనంతగా దుష్ప్రచారం జరుగుతోంది.
నిజాంకు ఎదురొడ్డి నిలిచిన ఎందరో వీరులు
రానున్న రజాకర్ల సినిమా ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి అతిథిగా హాజరైన, అదే టాను గుడ్డయైన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, పాపం రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన వారిని ప్రస్తావిస్తూ… ”అది హిందూ ముస్లిం గొడవ కాదు అనేకమంది ముస్లిం యోధులు కూడా నిజాంకి వ్యతిరేకంగా పనిచేశారు” అని చెప్పగానే నిర్మాతలకు, ఆ సినిమాను ఆయుధంగా మలుచుకోజూస్తున్న కొంతమంది మతతత్వవాదులకు నోట్లో వెలక్కాయ పడినట్లు అయింది. ”సత్యాన్వేషణలో ఒక వ్యక్తి మరణిస్తే సంతోషించాలి గానీ బాధపడకూడదు” అన్న గాంధీ మాటలను ఉటంకిస్తూ నిజాం ప్రభువును వ్యతిరేకించి ప్రాణాలు అర్పించిన షోయబుల్లాఖాన్‌ను ఒక మతానికి ఆపాదించగలమా? తాను పనిచేస్తున్న తేజ్‌ అక్బర్‌ అనే పత్రికను బ్యాన్‌ చేయగానే రయ్యత్‌ అనే ఉర్దూ పత్రికలో చేరారు, దానినీ బ్యాన్‌ చేయగానే, తల్లి నగలను అమ్మి ఇమ్రోజ్‌ అనే స్వంత పత్రికను స్థాపించి ఖాసీం రజ్వీ అక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ప్రాణాలు పణంగా పెట్టి 28ఏళ్లకే తుది శ్వాస విడిచిన షోయబుల్లాఖాన్‌కు సాటి ఎవరు రాగలరు. దొరల కుటుంబంలో పుట్టి, దొరతనాన్ని అనుభవించే అవకాశం ఉండి కూడా, దొరల దుర్నీతికి ఎదురు నిలిచి దోపిడీ వ్యవస్థను దునుమాడిన అనభేరి ప్రభాకర్‌రావుకి ఏ మతాన్ని ఆపాదించగలవు? నిజాం అండదండలతో ప్రజలు పండించిన పంటలను దోచుకుని వెళ్తున్న విష్ణుకర్‌ దేశ్‌ముఖ్‌పై కోర్టులో కేసు వేసినందుకు ప్రాణాలర్పించవలసి వచ్చిన షేక్‌ బందగి వారసత్వం ఒక మతానికి చెందినదేనా? నారాయణరావు పవార్‌, జగదీష్‌, గండయ్య వంటి వారు ప్రాణాలకు తెగించి నిజాంపై బాంబులు విసిరి బలైపోయిన సంఘటనలేవీ మతానికి మాత్రమే ప్రతీక కావని అర్థం చేసుకోలేమా! మహా పాండిత్యంలో ఆరితేరిన దాశరధి కృష్ణమాచార్యులు సాయిధ పోరాటానికి అండగా నిలవడం వల్ల జైలు పాలై, అక్కడ వట్టికోట ఆళ్వారు స్వామి వారితో కలిసి ”కాలే కడుపుల ఆకలి తీర్చలేని పంట లెందుకు, కాల్చిపారేయండి” అంటూ జైలు గోడలపై కవిత్వాన్ని లిఖించి వీరుల లక్ష్యాలకు కోరలు నూరిన వారి గొప్పతనం ఒక మతం తరపున సాగిందని సంకుచితత్వాన్ని ఆపాదిద్దామా?
రజాకార్లవి దాష్టీకాలే కానీ హైదరాబాద్‌ వీలీనంలో మత కోణానికి తావు లేదు. చరిత్రలో భాగం లేని వారే దానిని వక్రీకరించి లాభ పడజూస్తారు. అధికార దాహానికి అర్రులు చాచే వీరు దాని పర్యావసానాలు భావితరాలపై ఎంత ప్రభావితమవుతాయో తెలిసి కూడా తప్పు చేస్తారు. విజ్ఞ్తత విస్తృతమైనప్పుడే మతములన్నియు మాసిపోవును మానవత్వమే మిగిలి వెలుగును.
– జి.తిరుపతయ్య, 9951300016

Spread the love