– ఇప్పటికే శిక్షార్హంగా పరిగణిస్తున్న పలు దేశాలు
– వందకు పైగా దేశాల్లో ఇది అమలు
– భారత్‌లో మాత్రం అందుకు విరుద్ధం
– లైంగికదాడిగా పరిగణించలేమంటున్న కేంద్రం
– మహిళా న్యాయవాదులు, హక్కుల నేతల విస్మయం
– కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై ఆగ్రహం
న్యూఢిల్లీ : వివాహమంటే ఒక స్త్రీ తన హక్కులను కోల్పోవటంతో సమానమేనా? పెండ్లి తర్వాత మానసిక, శారీరక వేధింపులకు సిద్ధమై ఉండాలా? వైవాహిక లైంగికదాడి విషయంలో కేంద్రం వాదనలు వింటే మహిళల హక్కుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ అలా అనిపించక మానదు. వైవాహిక లైంగికదాడిని నేరంగా పరిగణించలేమని కేంద్రం.. భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ దీనిని నేరంగా పరిగణిస్తే, అది దాంపత్య బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వివరించింది. వైవాహకి లైంగికదాడిని నేరంగా పరిగణించటమనేది సుప్రీంకోర్టు పరిధిలో లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈనెల 3న సుప్రీంకోర్టుకు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ 49 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. కేంద్రం వాదనపై తీవ్ర చర్చే జరిగింది. అలాగే, ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై సర్వత్రా విమర్శలూ వస్తున్నాయి. ముఖ్యంగా, మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్రం వాదనలను మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నాయకులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వివాహమంటే.. స్త్రీ తన హక్కులను కోల్పోవటంతో సమానమనే భావనను కేంద్రం తీసుకొస్తున్నదని ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది తులసిరాజ్ ఆరోపించారు. హక్కుల విషయంలో భారత రాజ్యాంగం మహిళలకు హామీనిచ్చిందని ఆమె గుర్తు చేశారు.
18 ఏండ్ల కంటే తక్కువ వయసు లేని స్వంత భార్యపై భర్త లైంగిక సంపర్కం, చర్యలు లైంగికదాడి కిందకు రావని భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 375 (మినహాయింపు 2), ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 63 (మినహాయింపు 2) పేర్కొంటున్నాయి.
భారత్ కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో వైవాహిక లైంగికదాడి నేరంగా పరిగణించబడుతున్నది. అయితే, వైవాహిక లైంగికదాడి చట్టవిరుద్ధం కాని 36 దేశాల్లో భారత్ ఒకటిగా ఉండటం గమనార్హం. వైవాహిక లైంగికదాడిని నేరంగా పరిగణిం చాలంటూ దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలె ౖనప్పటికీ.. భారత్‌లోని పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాకపోవటం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు 2022, మేలో ఈ కేసుపై మిశ్రమ తీర్పును ఇచ్చింది.
ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ సవాలును స్వీకరించి, విచారణ జరపటానికి అంగీకరించింది. వైవాహిక లైంగికదాడిని నేరంగా చేర్చలేమని 2017లో కేంద్రం పేర్కొన్నది. అది వివాహ వ్యవస్థపై అస్థిర ప్రభావాన్ని చూపుతుందని వివరించింది. అయితే, 2022లో ఈ సమస్యకు విస్తృత సంప్రదింపులు అవసరమని పేర్కొనటం గమనార్హం. కేంద్రం వాదన స్త్రీ గౌరవం, శారీరక గోప్యతను ఉల్లంఘించటమేనని మహిళా న్యాయవాదులు అంటున్నారు. ఏకాభిప్రాయం లేని, హింసాత్మకమైన, బలవంతపు లైంగిక సంబంధాలకు పాల్పడే భర్తకు శిక్షార్హమైన పరిణామాల విషయంలో ఇది చట్టపరమైన కవచాన్ని సృష్టిస్తుందని ఆరోపిస్తు న్నారు. కేంద్రం అఫిడవిట్.. మహిళల శారీరక స్వయం ప్రతిపత్తి హక్కును విస్మరిస్తున్నదని న్యాయవాది రాధికా రారు అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) ప్రకారం.. 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయసు గల స్త్రీలలో దాదాపు 83 శాతం మంది తమ జీవిత భాగస్వామి ద్వారా వేధింపులకు గురైనట్టు తెలపటం గమనార్హం.
కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు భార్యల పట్ల శాపంగా మారనున్నాయనీ, దీనిని ఆసరాగా చేసుకొని అనేక మంది భర్తలు రెచ్చిపోయే ప్రమాదమున్నదని మహిళా న్యాయవాదులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో తీవ్రంగా పరిగణించే సమయం ఆసన్నమైందని వారు చెప్తున్నారు. ”స్త్రీ పెండ్లయ్యాక కేవలం భార్యగా తల్లిగా మాత్రమే ఉండాలనే ఆలోచనా విధానాన్ని పెంపొందిం చటాన్ని ప్రారంభించటం చాలా ముఖ్యం. మహిళ కేవలం పునరుత్పత్తి, గృహ ప్రయోజనాల కోసం ఉపయోగిం చబడే వస్తువు కాదు. ఆమె మొదట పూర్తి శారీరక స్వయంప్రతిపత్తిని కలిగి ఉన్న వ్యక్తి. తన భర్తతో ఎప్పుడు లైంగికంగా పాల్గొనకూడదో నిర్ణయించుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది” అని మహిళా న్యాయ వాదులు వివరించారు.