రైతులంటే కాంగ్రెస్ కు కండ్ల మంట ఎందుకు

– కాంగ్రెస్ కావాలో..  కరెంట్ కావాలో ఆలోచించాలి
– ఇప్పుడే రైతుబంధు అడ్డుకున్న కాంగ్రెస్ రైతులను పట్టించుకుంటుందా…?
– రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చిన్న చూపే
– తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ – హైదరాబాద్: రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని మరో సారి రుజువైందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాకుండా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా రైతుబంధు డబ్బులు ఇవ్వడానికి ఈసీ అనుమతి ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రైతులు అండగా ఉన్నారని కండ్ల మంటతోనే కాంగ్రెస్ ఈసీ మళ్లీ ఫిర్యాదు చేసి కక్ష్యపూరితంగా కావాలనే నిలిపి వేయించిందన్నారు. ఎన్నికలు కాకముందే రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తేవారిని ఎలా నమ్మేదని ప్రశ్నించారు. నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తకొక్కడం కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని అందుకే ఇప్పుడు రైతుబంధు నిలిపివేయించారని దుయ్యబట్టారు. గతంలో 3 గంటలు కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి రైతులపై అక్కసు వెళ్లగక్కితే.. రైతులకు పెట్టుబడిసాయంగా ఇచ్చే రైతుబంధు దుబారా ఖర్చు అని ఉత్తమ్ కుమార్ రైతుల పట్ల వారికి ఉన్న కక్ష్యను వెళ్లగక్కరని ధ్వజమెత్తారు. ఇప్పటికి సీఎం కేసీఆర్11 సార్లు రైతులకు రైతుబంధు అందజేశారని గుర్తు చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు రైతన్నలకు రైతుబంధు రాకుండా ఆపోచ్చు కానీ డిసెంబర్ 3 తరువాత తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ సర్కారరే వచ్చి రైతన్నలకు అండగా నిలుస్తుందన్నారు. రైతు వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ ఓటు హక్కుతో తప్పకుండా బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.

Spread the love