– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
– సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించట్లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, పలువురు నేతలతో కలిసి తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటాలు, సమర యోధుల త్యాగాలను కండ్లకు కట్టినట్టు ఎగ్జిబిషన్‌లో చూపెట్టారన్నారు. కొమరంభీమ్, ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాలను స్మరించుకున్నారు. భారత్‌లో విలీనమయ్యేందుకు నిజాం లొంగకుంటే ఆపరేషన్ పోలోతో శస్త్ర చికిత్స చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభాయి పటేల్ అని కొనియాడారు. ప్రజలను 50 ఏండ్లుగా వంచిస్తున్న కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. మహిళలను నగంగా బతుకమ్మ ఆడించిన, పరకాల, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లిలో వందల మందిని బలి తీసుకున్న రజాకార్ల వారసుడైన ఓవైసీని సీఎం పొగడటం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నించారు. జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అనేటోళ్లకు వత్తాసు పలకటం కాంగ్రెస్ పరాకాష్టకు నిదర్శనమన్నారు. బీజేపీ పార్లమెంట్ బోర్డు మెంబర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన పోరాటాలను పాఠ్యాంశాలుగా పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.