– సర్కారుకు వైఎస్ షర్మిల ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి పాకిందని బీజేపీ చెబుతున్నదనీ, కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్టు నటిస్తానంటూ జరిగిన ఒప్పందంలో భాగమే ఇరు పార్టీలు విమర్శించుకుంటున్నాయని పేర్కొన్నారు. నిజంగా వీరి మధ్య ఎలాంటి రాజకీయ ఒప్పందం లేకపోతే..కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా కేసీఅర్ అవినీతి చిట్టా బీజేపీ దగ్గర ఉందని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై సాక్ష్యాధారాలున్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. విభజన హామీలపై అమీతుమీకి ఎందుకు సిద్దపడటంలేదో తేల్చాలని బీఆర్ఎస్ సర్కార్ను ఆమె ప్రశ్నించారు. లిక్కర్ స్కాం నుంచి ఇరు ప్రభుత్వాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు కుదిరాయని ఆరోపించారు.