ప్రాణ ప్రతిష్ట రోజు సెలవెందుకు?

Prana Pratistha Day holiday?– కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర విద్యార్థులు
ముంబయి : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నెల 22న సెలవు ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నలుగురు విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. ఈ విద్యార్థులు మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబయి-నిర్మా న్యాయ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. సెలవుకు సంబంధించి ఈ నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని వారు అభ్యర్థించారు. సెలవుల ప్రకటనకు సంబంధించిన ఏ విధానమైనా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఇష్టాలపై ఆధారపడి ఉండకూడదని వారు తమ పిటిషన్‌లో వాదించారు. దేశభక్తి కలిగిన లేదా చరిత్రకు సంబంధించిన వ్యక్తిని గుర్తు చేసుకునేందుకు సెలవు ప్రకటించవచ్చునని, కానీ సమాజంలో ఓ వర్గాన్ని లేదా మతాన్ని సంతృప్తి పరచడానికి సెలవు ఇవ్వరాదని తెలిపారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం ప్రకారం సెలవులు ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ 1968 మే 8న హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కూడా న్యాయ శాస్త్ర విద్యార్థులు సవాలు చేశారు. ‘విద్యా సంస్థల్ని మూసివేస్తే చదువులకు నష్టం వాటిల్లుతుంది. బ్యాంకింగ్‌ సంస్థల్ని మూసివేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తే పరిపాలనకు సంబంధించిన పనులు నిలిచిపోతాయి’ అని పిటిషనర్లు వివరించారు. ‘సెలవులు ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని కల్పించే చట్టం ఏదీ లేదు. లౌకిక స్వభావం కలిగిన మార్గదర్శకాలూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మెజారిటీ సమాజాన్ని…అది కూడా రాజకీయ ఉద్దేశాల కోసం…ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేయడం అధికార దుర్వినియోగమే అవుతుంది. అది భారత లౌకిక స్వరూపాన్ని నాశనం చేస్తుంది’ అని తెలిపారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం సెలవు ప్రకటించడం ప్రభుత్వ ఖజానాకు ఖర్చే తప్ప మరోటి కాదని, ఇలాంటి వాటిని రాజ్యాంగంలోని 27వ అధికరణ నిషేధిస్తోందని పిటిషనర్లు వాదించారు.

Spread the love