గోప్యత ఎందుకో…!

– వికలాంగుల సమాచారాన్ని దాచిపెడుతున్న కేంద్రం
– సామాజిక, ఆర్థిక వివరాల ఊసే లేదు
– కుంటిసాకులతో తప్పించుకునే ప్రయత్నం
న్యూఢిల్లీ : వికలాంగుల నమోదు సమయంలో సేకరించిన సామాజిక, ఆర్థిక సమాచారాన్ని బహిర్గతం చేయరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు (యూడీఐడీ) జారీ చేసే నిమిత్తం గత ఆరు సంవత్సరాలుగా కేంద్రం వారి పేర్లను నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే వారి సామాజిక, ఆర్థిక సమాచారాన్ని సేకరించింది. అయితే అందులో నాణ్యత లేదని, అందుకే సమాచారాన్ని బయటపెట్టడం లేదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చెబుతోంది.
వికలాంగుల నమోదు సమయంలో వారి కులం, విద్యార్హతలు, ఉద్యోగం, ఆదాయం (వ్యక్తిగత, కుటుంబ), వివాహితులా అవివాహితులా అనే వివరాలు తీసుకున్నారు. అయితే వాటిని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వికలాంగులకు సంబంధించిన సమాచారం పైనే దృష్టి కేంద్రీకరించామని, అనేక ప్రశ్నలను ఐచ్ఛికం చేశామని, చాలా మంది వాటికి సమాధానం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దివ్యాంగ సర్టిఫికెట్‌ జారీ చేయడమే సమాచార సేకరణ ప్రధాన ఉద్దేశమని, పత్రాన్ని అనేక ప్రశ్నలతో నింపి చాంతాడంత బారున తయారు చేయలేదని, పైగా అన్ని అంశాలనూ సరిచూడడం సాధ్యం కాదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రాజేష్‌ అగర్వాల్‌ చెప్పారు.
అంతా దాపరికమే
దేశంలోని 94 లక్షల యూడీఐడీ రిజిస్ట్రేషన్ల నుంచి సేకరించిన సగటు సమాచారాన్ని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. అయితే అందులో సామాజిక, ఆర్థిక సమాచారం మాత్రం లేదు. సామాజిక, ఆర్థిక సమాచారం సహా వికలాంగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించడమే ప్రాజెక్ట్‌ ఉద్దేశమని గతంలో మంత్రిత్వ శాఖ తెలిపింది.
కానీ ఆచరణలో మాత్రం సామాజిక, ఆర్థిక సమాచారాన్ని గోప్యంగా ఉంచింది. సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఎంతమంది వికలాంగులు సమాధానం ఇవ్వలేదో కూడా మంత్రిత్వ శాఖ చెప్పడం లేదు. వ్యక్తిగత-కుటుంబ ఆదాయం ఎంత, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారా, ఉద్యోగం చేస్తున్నారా, వృత్తి ఏమిటి, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/జనరల్‌ కేటగిరీలో దేనికి చెందిన వారు, విద్యార్హతలు ఏమిటి వంటి ప్రశ్నలకు వికలాంగులు ఇచ్చిన సమాధానాలను కూడా ప్రభుత్వం గోప్యంగానే ఉంచింది.
ఐచ్ఛిక ప్రశ్నలే అధికం
సమాచారాన్ని అంత గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారన్న ప్రశ్నకు ఓ అధికారి సమాధానమిస్తూ ‘వివాహం అయిందా కాలేదా అని అడిగిన ప్రశ్నకు కేవలం 15% మంది మాత్రమే సమాధానం ఇచ్చారు. ఇది సరిపోదు. ఆదాయం వివరాలు అడిగితే 40% మంది మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన సమాచారం సరైనదా కాదా అని నిర్ధారించుకోవడం కూడా మాకు కష్టంగా ఉంది’ అని బదులిచ్చారు. వైద్య పరమైన సమాచారాన్ని, వికలాంగ సంబంధమైన సమాచారాన్ని కేవలం వైద్యులు మాత్రమే నిర్ధారించగలరని చెప్పారు. వికలాంగులా కాదా అనే ప్రశ్నకు మాత్రమే తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని కోరామని, చాలా ప్రశ్నలు ఐచ్ఛికమేనని వివరించారు. ఏదేమైనా వికలాంగుల సమాచారాన్ని బయటపెట్టకుండా ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
అయితే ఇక్కడ ఓ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రత్యేక విద్యార్హతలు, ఒకేషనల్‌ శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, స్కాలర్‌షిప్పులు వంటి అంశాలలో ప్రతిభ చూపిన దివ్యాంగులకు మంత్రిత్వ శాఖ కొన్ని ప్రయోజనాలు కల్పించింది. కానీ ఆ వివరాలు కూడా ప్రభుత్వం బయటపెట్టలేదు. వికలాంగులను ‘డిజిటల్‌ ఇండియా’తో అనుసంధానం చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పినప్పటికీ వారి కంప్యూటర్‌, మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగంపై ప్రశ్నలేవీ అడగలేదు. ఆరో రౌండ్‌ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేకు సంబంధించిన సమాచార పత్రం నుండి వికలాంగ సంబంధమైన ప్రశ్నలను తొలగించడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శల దాడి చేశాయి.

Spread the love