ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో భారతదేశంలో యావత్ ప్రజానీకం తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ విద్యా విధానం 2020’ ని ముందుకు తెచ్చింది. విద్యారంగంలో నిష్ణాతులైన కొందరు మేధావులు – విద్యావేత్తల వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. అఖిల భారత విద్యాహక్కు పరిరక్షణ కమిటీ, విద్యారంగ అనుభవజ్ఞులు ‘ఈ విద్యావిధాన చర్య అప్రజాస్వామికం; ప్రజావ్యతిరేకం… దీన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకు వెనక్కు తీసుకోవాలి’ అనే డిమాండ్ వెనుక వుద్దేశాలు, వాస్తవాలు ఈ వ్యాసాల్లో కూలంకషంగా తెలియజేస్తాయి. 2020 జులై 29న నూతన జాతీయ విద్యావిధానాన్ని కేబినెట్ ఆమోదించింది. విద్యారంగ నిపుణులు, విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యారంగంలో విస్తరిస్తున్న వ్యాపారీకరణ కార్పొరేటీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణ లాంటి ధోరణులకు వ్యతరేకంగా ఉద్యమించి పోరాడాలనే ‘సందేశాన్ని’ ఈ వ్యాసాలు గట్టిగా నొక్కిచెప్పాయి.
ప్రొ||ప్రభాత్ పట్నాయక్, ప్రొ||హరగోపాల్, ప్రొ||మాడభూషి శ్రీధర్, ప్రొ||అనిల్ సద్గోపాల్, డా||ఎ.పున్నయ్య, డా||లచ్చయ్య గాండ్ల, ఎనిశెట్టి శంకర్, ఉపాధ్యాయ పత్రికల సంపాదకీయాలు, వివిధ సంఘాల నాయకుల అభిప్రాయాలతో దాదాపు 16కి పైగా వున్న వ్యాస సంకలనం ఇది.
తార్కికంగా ప్రశ్నించే బోధనా పద్ధతులు కావాలని క్రీస్తుకు పూర్వమే గౌతమ బుద్ధుడు, మహావీరుడు లాంటి తత్వవేత్తలు కోరుకున్నారు. బ్రాహ్మణాధిపత్యాన్ని సమర్ధించే భావజాలం విద్యావిధానంతో నింపివేయడం ఎలా అర్థం చేసుకోవాలి?
గూగుల్, అంబానీ సంస్థల్ని పెంచేందుకు… ఆన్‌లైన్ చదువుల వ్యాపార విస్తరణ ,1 లక్ష 12 వేల అయిదు వందల కోట్లకి పెరిగే మార్కెటింగ్ ఏజెన్సీల అంచనాలున్నాయి. కార్పొరేట్ శక్తుల లబ్దికే ఈ పన్నాగాలు. అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు, పేద, వెనుకబడిన దేశాలలోని విద్యార్థులకు అందిస్తున్న కోర్సులన్నీ నాసిరకంగా వుంటున్నాయని యునెస్కో 2000 సం|| నివేదించింది.
ప్రి.నర్సరీ నుండి 12 వ తరగతి దాకా నాణ్యమైన విద్య అందించాలని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. 18 రాష్ట్రాలలో డిపెప్ ప్రోగ్రాం అనుభవాలేమిటి? జనాభాలో 85 శాతం దళిత, ఒబిసి, ముస్లిం, గిరిజన, విద్యార్థుల విద్య విషయక పరిస్థితులెలా వున్నాయి? సంస్కృతం, సంస్కృతి, జొప్పింపు ప్రయోజనాలేమిటి? 1948 రాధాకృష్ణన్ కమిటి, 2018 రంగన్ కస్తూరి కమిటి, 1966 కొఠారి కమిషన్ ఏం చెప్పాయి? 1986 నాటి జాతీయ విద్యావిదానం 104.62 మిలియన్లు యువత 2022 నాటికే జాబ్ మార్కెట్‌లో ప్రవేశించారు. ఇలా విద్యపై జాతీయ విద్యా విధానంపై సమగ్ర అవగాహనకు ఈ పుస్తకం చక్కటి కరదీపిక.
– తంగిరాల చక్రవర్తి, 9393804472