అల్లర్లను బోధించటం దేనికి?

అల్లర్లను బోధించటం దేనికి?– కొన్నింటిని సెలెక్టివ్‌గా ప్రస్తావించడం సరికాదు
– పాఠ్యపుస్తకాల్లో కొన్ని అంశాల సవరింపులపై ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌
న్యూఢిల్లీ : ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ డి.పి సక్లానీ గుజరాత్‌ అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన హింసను 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి తొలగించటాన్ని సమర్థించారు. కొన్నింటిని సెలెక్టివ్‌గా ప్రస్తావించటం మంచిది కాదని నిపుణుల కమిటీ భావించిందని ఆయన అన్నారు. ”మనం పాఠశాల పాఠ్యపుస్తకాల్లో అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి? మనం సానుకూల పౌరులను సృష్టించాలనుకుంటున్నాం. హింసాత్మక, అణగారిన వ్యక్తులను కాదు. అయోధ్య విభాగంలోని సవరణలు నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉన్నాయి. వివాదంపై సుప్రీంకోర్టు 2019 తీర్పునకు అనుగుణంగా ఉన్నాయి” అని ఆయన చెప్పారు. అయోధ్య అంశానికి సంబంధించి 12వ తరగతి పుస్తకంలోని 8వ అధ్యాయంలో నాలుగు నుంచి రెండు పేజీల వరకు కుదించారు. గత వారం మార్కెట్‌లోకి వచ్చిన ఈ సవరించిన పాఠ్యపుస్తకం మాత్రం బాబ్రీ మసీదు పేరును ప్రస్తావించలేదు. దానిని ”మూడు గోపురాల నిర్మాణం” అని పిలుస్తూ, గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు బీజేపీ రథయాత్ర, కరసేవకుల పాత్ర, డిసెంబర్‌ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో మత హింస, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనతో సహా మునుపటి వెర్షన్‌ నుంచి చెప్పే వివరాలను తొలగించింది.
బాబ్రీ మసీదు కూల్చివేత, 2002 గుజరాత్‌ అల్లర్ల తరువాత జరిగిన మత హింసకు సంబంధించిన కంటెంట్‌ను విస్మరించటంపై ఆయన మాట్లాడుతూ.. ”మన దేశంలో చాలా మతపరమైన అల్లర్లు జరిగాయి. కొన్నింటిని సెలెక్టివ్‌గా పేర్కొనటం మంచిది కాదనీ, పాఠశాలల్లో చరిత్రను వాస్తవాలు చెప్పటానికే బోధిస్తున్నారనీ, దానిని యుద్ధభూమిగా మార్చకూడదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది” అని తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన సంఘటనలు, దాని తదనంతర పరిణామాలపై ఇతర వివరాలను ఎందుకు వదిలిపెట్టారని అడిగిన ప్రశ్నకు.. ”కొత్త కంటెంట్‌ను ( సుప్రీంకోర్టు తీర్పుపై) ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.
చంపారు క్యాబినెట్‌లోకి కల్పనా సోరెన్‌ ఇప్పటికే రాహుల్‌ను కలిసిన జార్ఖండ్‌ మాజీ సీఎం భార్య
రాంచీ : కొత్తగా ఎన్నికైన జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే కల్పనా సోరెన్‌ ముఖ్యమంత్రి చంపారు సోరెన్‌ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. కల్పన తన పార్టీ నిర్ణయం గురించి తెలియజేయటానికి గత వారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీని కలిశారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నది. అక్కడ ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన కల్పనా సొరెన్‌ భర్త హేమంత్‌ సోరెన్‌ జైలులో ఉండటంతో.. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కల్పనా జేఎంఎం పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎదిగారు. ఆమె ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించనున్నారు.

Spread the love