– మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగంతో
– సభ్యసమాజం తలెత్తుకోలేని దుస్థితి
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
– రాత్రి సమయంలో మహిళను పోలీస్ స్టేషన్‌లో ఉంచే హక్కు ఎక్కడిది?
– సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి :కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
– డీఐ రాంరెడ్డితోపాటు మరో ఐదుగురిపై వేటు సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు
నవతెలంగాణ- షాద్‌నగర్
దొంగతనం నెపంతో పోలీసుస్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగానికి గురైన బాధిత దళిత మహిళను సోమవారం పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దొంగతనం కేసు నెపంతో మహిళ సునీతపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం విదితమే. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు వాణిదేవి, నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు పలువురు పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు తదితరులు బాధితురాలిని కలిసి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతో సభ్యసమాజం తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసులు ఉండరని, లాఠీ పోలీసులు మాత్రమే ఉంటారని ఎద్దేవా చేశారు. మహిళ అని చూడకుండా చిత్రహింసలకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. తక్షణమే డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డితోపాటు ఈ కేసులో ఉన్నవారందరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో మహిళలను పోలీస్ స్టేషన్‌లో ఉంచే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. బాధితురాలు సునీత నోటి వెంట నిజాలు వింటుంటే తమకు ఎంతో బాధ కలిగిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హౌంమంత్రి ఒక్కడేనని, ఆయన అండ చూసుకొనే పోలీసులు ఇలా చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లతో పోలీసులు సెటిల్‌మెంట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ తరపున తక్షణ సాయంగా బాధితురాలి కుటుంబానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రూ.లక్ష అందజేశారు. వారి వెంట మున్సిపల్ చైర్మెన్ నరేందర్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ఈట గణేష్, వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ నటరాజ్ తదితరులు ఉన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి –కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
దళిత మహిళ సునీతపై షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టన్ రాంరెడ్డి, మరో నలుగురు కలిసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. బాధ్యులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కోరారు. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలు సునీతను కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడ సామేలు, యం.ప్రకాష్ కరత్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి.లక్ష్మీదేవి తదితరులతో కలిసి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. దొంగతనం నెపంతో మహిళపై పోలీసులు ఇష్టానురీతిగా దాడి చేయడం దుర్మార్గమన్నారు. బాధిత పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారి వెంట సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్.రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనునాయక్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్‌నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సీఐటీయూ సీనియర్ నాయకులు వడ్ల చంద్రమౌళి, నాయకులు కావలి రాజు, రాజశేఖర్, శ్రీనివాస్ ఐద్వా నాయకురాలు లక్ష్మి, కేవీపీఎస్ నాయకులు కొంగరి నర్సింహులు, మహమ్మద్, బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు దళిత, మహిళా చైతన్యం సంఘం నాయకులు సునీతను పరామర్శించారు.
డీఐ రాంరెడ్డితోపాటు మరో ఐదుగురిపై వేటు
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఘటనలో డీఐతోపాటు మరో ఐదుగురిపై వేటు పడింది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి, ఐదుగురు పోలీసులు మోహన్‌లాల్, కరుణాకర్, అఖిల, రాజు, జాకీర్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు.