నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రియుడితో కలసి భర్తను భార్య హత్య చేసిన ఘటన మండలంలోని గజసింగరాజపురంలో చోటుచేసుకుంది. సీఐ రవీంద్ర, ఎస్సై వెంకటేష్‌ల కథనం మేరకు.. గజసింగరాజపురానికి చెందిన ఆంటోని (34), సుగంధ్రి (30) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సుగంధ్రి స్వగ్రామం నిండ్ర మండలంలోని ఇరుగువాయి ఎస్సీకాలనీ. ఆమెకు కొన్ని సంవత్సరాలుగా అదే కాలనీకి చెందిన అరుళ్‌రాజ్(35)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను తరచూ మందలించేవాడు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో ఆమె విషయాన్ని ప్రియుడికి తెలిపింది. చివరకు భర్తను చంపడానికి ఇద్దరూ ప్రణాళిక వేసుకున్నారు. శుక్రవారం రాత్రి అతడి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా ఇంట్లో నిద్రించిన సుగంధ్రి.. రాత్రి తన భర్త మద్యం తాగి వచ్చి ఇంటి వెలుపల పడుకుని చనిపోయాడని కేకలు వేసింది. అనుమానం వచ్చిన బంధువులు ఆమెను నిలదీయటంతో పొంతనలేని సమాధానమివ్వడంతో పోలీసులకు సమాచారం అందించారు. చివరకు హత్య చేసినట్లుగా అంగీకరించడంతో పోలీసులు ఆమెతోపాటు ప్రియుడిని అదుపులోకి తీసుకుని మృతదేహానికి సత్యవేడులో పోస్టుమార్టం నిర్వహించారు.