– ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆగ్రహం
– తడిచిన, మొలకెత్తిన ధాన్యం కొనట్లేదని ఆవేదన
– సొసైటీ కార్యాలయం ఎదుట ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన
నవతెలంగాణ-బోధన్ / భువనగిరిరూరల్/ మహబూబాబాద్
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న రైతన్నలు సొసైటీ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్ల తీరుతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అసలే కొనుగోళ్లలో ఆలస్యం.. మిల్లర్ల దోపిడీతో సతమతమవుతుండగా.. మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రంగు మారి మొలకెత్తింది. అయితే, ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో జరగడం లేదు. దాంతో విసుగు చెందిన ఓ రైతు మొలకెత్తిన ధాన్యాన్ని బుధవారం సొసైటీ ఎదుట కుమ్మరించి తన ఆవేదన వ్యక్తం చేశాడు. మరోచోట క్వింటాకు 5 కిలోల తరుగు తీస్తుండటంతో రైతులు రాస్తారోకో చేశారు. ఇంకోచోట ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వడ్లకు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రానికి చెందిన రైతు కుంట్ల సాయిలు ధాన్యం వర్షానికి తడిసి రంగు మారింది. దాన్ని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు తీసుకోవడం లేదని విసుగుచెంది బుధవారం ఒక ట్రాలీ లోడు ధాన్యాన్ని సొసైటీ ఎదుట గుమ్మరించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సందర్భంగా రైతు కుంట్ల సాయిలు మాట్లాడుతూ.. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయి రంగు మారి మొలక వచ్చిందని తెలిపారు. అయినా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నా కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి రంగు మారిన,మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై సాలుర సొసైటీ సెక్రటరీ బస్వంతరావును వివరణ కోరగా, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పారు. అందువల్లే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. ఈపాటికే సాలుర కొనుగోలు కేంద్రంలో 4 వేల బస్తాలకు పైగా మొలకెత్తిన ధాన్యం ఉందని తెలిపారు.
ఐదు కిలోల తరుగు తీయడంపై ఆగ్రహం
తరుగు పేరుతో క్వింటా ధాన్యానికి ఐదు కిలోలు తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు యాదాద్రిభువనగిరి జిల్లా అనాజిపురం స్టేజి వద్ద ధర్నా నిర్వహించారు.పలువురు రైతులు మాట్లాడుతూ.. పరీక్షించిన తర్వాత సర్టిఫైడ్ చేసిన ధాన్యాన్ని మిల్లర్లు తరుగు పేరుతో ఐదు కిలోలు తగ్గించడం సరైనది కాదన్నారు. మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సర్పంచ్ ఎదునురి ప్రేమలతా మల్లేశం మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి రైతులను మోసం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పోలీసులు, మిల్లర్ సంఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. తరుగు తీయబోమని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మైలారం వెంకటేష్, ఎదునూరి వెంకటేశం, గోగు శ్రీనివాస్, పిట్టల వెంకటేశం, చంద్రయ్య, మహిళా రైతులు పాల్గొన్నారు.
ధాన్యానికి నిప్పు పెట్టి రాస్తారోకో
మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపెల్లి గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించిన రైతులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామ శివారులో రహదారిపై పంటకు నిప్పు పెట్టి.. రాస్తారోకో చేశారు. సీఐ రమేష్ బాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి రైతులను సముదాయించారు. అధికారులు వస్తే తప్ప రాస్తారోకో విరమించేది లేదని రైతుల మొండికేశారు. దీంతో పీఏసీఎస్ అధికారులు వచ్చి.. నేటి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదని, మిల్లుల్లో ధాన్యం అన్‌లోడ్ కాక ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోతున్నాయని వాపోయారు. దాంతో పీఏసీఎస్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు రావుల వెంకటరెడ్డి ధాన్యం కొనుగోలు చేసేది లేదని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు.