రేవంత్‌ ప్రమాణస్వీకారం.. కేసీఆర్ వస్తారా..?

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌: తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, టీడీపీ అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకలను రేవంత్‌రెడ్డే ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్‌ నేతలు చిదంబరం, అశోక్‌ గహ్లోత్‌, దిగ్విజయ్‌ సింగ్‌, వీరప్ప మొయిలీ, మీరాకుమార్‌, కుంతియా, భూపేష్‌ బఘేల్‌, అశోక్‌ చవాన్‌, వాయలార్‌ రవి, సుశీల్‌కుమార్‌ శిందే, మాణికం ఠాగూర్‌, కురియన్‌లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆహ్వానాలు పంపారు.
కేసీఆర్ వస్తారా…
రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారానికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కు కూడా ఆహ్వనం పంపారు. ఇప్పుడు కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తాడా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రేపు మధ్యాహ్నం 1గంటకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మొదలు కానుంది.

Spread the love