ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తా

Will NTR get Bharat Ratna?– వజ్రోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు
– ‘తారక రామం’ పుస్తకావిష్కరణ
విజయవాడ : నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌)కు భారతరత్న సాధిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో ఎన్టీఆర్‌ లిటరేచర్‌-సావనీర్‌ అండ్‌ వెబ్‌ సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలో ఆయన హాజరై ప్రసంగించారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ నిలువెత్తు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా 2025 ఎన్టీఆర్‌ క్యాలండర్‌, ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానంపై రూపొందించిన ‘తారక రామం’ పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడుగా నిలిచిపోతారన్నారు. ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్‌-2047 కల సాకారం చేసుకుందామన్నారు.సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర అని కొనియాడారు. జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీ నడిపిన ఏకైక వ్యక్తి అని అన్నారు. చదువు కోసం విజయవాడకు రావడం, తల్లికి సాయంగా పాలు అమ్మడం, గుంటూరుకు వెళ్లి చదువుకున్న విషయాలు తనతో పంచుకునేవారని గుర్తు చేసుకున్నారు. 1945లో మద్రాసు రైలు ఎక్కాక ఎన్టీఆర్‌ జైత్ర యాత్ర ప్రారంభమైందన్నారు. నెలవారీ జీతం కోసమే ఆయన మొదట ఆలోచించారని,ఎన్టీఆర్‌కు ఎల్‌వి ప్రసాద్‌, నాగిరెడ్డి, చక్రపాణి సహకారంతో సినీ అవకాశాలు వచ్చాయన్నారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో ఆయన నటించి ప్రాణం పోశారని వివరించారు. 300 సినిమాల్లో నటించారని, సినీ రంగంలో ఆయన పోషించిన ఏ పాత్ర గొప్పతనం దానిదేనని తెలిపారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారన్నారు. సినిమాలో 24 ఫ్రేమ్స్‌ చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెలిపారు. చిన్నరైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్టు శిఖరంగా ఎదిగి, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. ఇటు వెండితెర, అటు రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమేనని పేర్కొన్నారు. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు కల్పించింది ఆయనేనన్నారు. కూడు, గూడు, గుడ్డ నినాదం అమలు చేశారని తెలిపారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లకు నాంది పలికారన్నారు. మండల వ్యవస్థ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారని, కిలో రూ.2 బియ్యం పథకం తెచ్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ మొదటి సినిమా మనదేశం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఎన్టీఆర్‌ తొలిసారి నటించిన మనదేశం చిత్రం విడుదలైన 75 ఏళ్లు అయిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ మొదటి సినిమా హీరోయిన్‌ కృష్ణవేణి 102 సంవత్సరాల వయసులోనూ ఈ వేడుకకు హాజరు కావడం ఎంతో గొప్పవిషయమన్నారు. అచ్చ తెలుగుదనానికి, ఆత్మగౌరవానికి అర్ద్థం ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు. రంగం ఏదైనా ఆయన అడుగు పెట్టిన ప్రతిదీ సువర్ణ అధ్యాయమేనని అన్నారు. చరిత్ర ఉన్నన్నాళ్లు ఆయన ఉంటారని పేర్కొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలకు, కార్యదక్షతకు ఎన్టీఆర్‌ మారుపేరన్నారు. తెలుగు భాష ఔన్నత్యానికి రామారావు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జయప్రద, సినీనటి ప్రభ, ఎన్టీఆర్‌ కుమారులు మోహనకృష్ణ, రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎన్టీఆర్‌ లిటిరేచర్‌ కమిటీ అధ్యక్షులు టిడి. జనార్థన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులను జ్ఞాపికలను అందించి సత్కరించారు.

Spread the love