దశాబ్ది దాహం తీరేనా?!

–  డబ్య్లూటీసీ టైటిల్‌పై కన్నేసిన భారత్‌
–  సీస్‌కు అనుకూల పరిస్థితుల అండ
– ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేటి నుంచి
– మధ్యాహ్నాం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో…
పదేండ్లు.. భారత జట్టు ఐసీసీ టైటిల్‌ చివరగా 2013లో అందుకుంది. టీ20 ప్రపంచకప్‌లలో 2014లో రన్నరప్‌, 2016లో సెమీస్‌, 2021లో సూపర్‌ 12, 2022లో సెమీఫైనల్లో నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్‌లో 2015లో సెమీఫైనల్స్‌, 2019లో సెమీఫైనల్స్‌లో భంగపాటు తప్పలేదు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ, 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో రన్నరప్‌తో సరి. దశాబ్ద కాలంగా ప్రపంచ క్రికెట్‌లో అగ్రజట్టుగా వెలుగొందుతున్న టీమ్‌ ఇండియా.. ఐసీసీ టైటిల్‌ వేటలో అంతిమ విజయ దాహం తీర్చుకునేందుకు మరోసారి సిద్ధమవుతోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ గద కోసం నేటి నుంచి ఆస్ట్రేలియాతో ఐదు రోజుల సమరానికి సై అంటోంది. ఈ సారైనా గద దక్కేనా? పదేండ్ల టైటిల్‌ దాహం తీరేనా?!.
ఆస్ట్రేలియాతో చివరి నాలుగు టెస్టు సిరీస్‌లను భారత్‌ గెలుపొందింది. భారత్‌లో రెండుసార్లు, ఆస్ట్రేలియాలో రెండు సార్లు సిరీస్‌లు సాధించింది. నాలుగు సిరీస్‌లను సైతం 2-1తోనే నెగ్గటం విశేషం.
ఆసీస్‌పై 2000 పరుగులు చేసిన భారత బ్యాటర్ల క్లబ్‌లో చేరేందుకు విరాట్‌ కోహ్లి 21 పరుగుల దూరంలో నిలిచాడు. సచిన్‌ (3630), లక్ష్మణ్‌ (2434), ద్రవిడ్‌ (2143), పుజార (2033) ఈ జాబితాలో ఉన్నారు.
– ఓవల్‌ మైదానంలో ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ సగటు 97.75. ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లో స్మిత్‌ 391 పరుగులు చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు, ఓ అర్థ సెంచరీ ఉన్నాయి. ఓవల్‌లో భారత్‌ (0.400) ఆస్ట్రేలియా (0.411) గెలుపోటముల శాతం దాదాపుగా సమానం!. 14 టెస్టుల్లో ఏడు ఓడిన భారత్‌.. రెండు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా 38 టెస్టుల్లో 17 పరాజయాలు చవిచూసి ఏడింట గెలుపొందింది.
పదేండ్లుగా ఐసీసీ టైటిల్‌ నెగ్గలేదనే ఒత్తిడి ఏమాత్రం లేదు. ఫైనల్‌కు ముందు పెద్దగా హైప్‌ లేకపోవటం భారత జట్టుకు ఉపయోగకరం. టెస్టు చాంపియన్‌షిప్‌ నెగ్గుతామనే నమ్మకం ఉంది.
– రాహుల్‌ ద్రవిడ్‌
తుది జట్లు (అంచనా)

భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, కె.ఎస్‌ భరత్‌/ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌/శార్దుల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌.
ఆస్ట్రేలియా : డెవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజ, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిశ్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయాన్‌, స్కాట్‌ బొలాండ్‌.
నవతెలంగాణ-కెన్నింగ్టన్‌
భారత్‌, ఆస్ట్రేలియా.. ప్రపంచ క్రికెట్‌లో పదేండ్లుగా అగ్రశ్రేణి జట్లుగా కొనసాగుతున్నాయి. ఇరు జట్లలోనూ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌, ఆస్ట్రేలియా సమరం సంప్రదాయ క్రికెట్‌లో దాయాదుల పోరును మించిపోతుంది!. ఐదు రోజుల ఫార్మాట్‌లో అత్యుత్తమ జట్లు అంతిమ పోరుకు సిద్ధమయ్యాయి. ఐసీసీ నాలుగు టైటిళ్లలో మూడింటిని సొంతం చేసుకున్న భారత్‌, ఆస్ట్రేలియా.. నేటి నుంచి ఆరంభం కానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో విజయంతో నాల్గో టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. రెండేండ్ల పాటు సాగిన 2023 ఐసీసీ డబ్ల్యూటీసీ నేటి నుంచి ది ఓవల్‌లో అంతిమ సమరంతో ముగియనుంది. లీగ్‌ దశలో అగ్రస్థానాల్లో నిలిచిన భారత్‌, ఆస్ట్రేలియాలు ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గద కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌ అంతిమ సమరం నేటి నుంచి ది ఓవల్‌లో ఆరంభం. టెస్టు మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభమై రాత్రి 10 గంటలకు ముగియనుంది.
సమిష్టిగా మెరిస్తేనే
ప్రతిష్టాత్మక ఫైనల్‌కు భారత ఇద్దరు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. మ్యాచ్‌ ఫలితాన్ని బ్యాట్‌తో శాసించే రిషబ్‌ పంత్‌, బంతితో శాసించే జశ్‌ప్రీత్‌ బుమ్రాలు ఫిట్‌నెస్‌ సమస్యలతో అందుబాటులో లేరు. ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్ల లేవలు దూరమైనా.. సమిష్టిగా మెరిస్తే భారత జట్టు ఈసారి విజేతగా నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌ లైనప్‌లో శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారలు మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్‌ శర్మ, అజింక్య రహానెలు సైతం సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా జోరుమీదున్నారు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో భారత్‌కు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. కానీ తుది జట్టు కూర్పులో ఒకట్రెండు బెర్తులపై నిర్ణయమే కీలకం కానుంది. నలుగురు సీమర్లు లేదా ఇద్దరు స్పిన్నర్లు.. వికెట్‌ కీపర్‌గా భరత్‌, ఇషాన్‌లలో ఎవరనేది జట్టు మేనేజ్‌మెంట్‌ తేల్చాల్సి ఉంది. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో తుది జట్టు కూర్పు భారత్‌ను గట్టిగా దెబ్బకొట్టింది. ఈసారి టీమ్‌ ఇండియా ఈ తప్పిదాన్ని పునరావృతం చేయకూడదు.
ఉత్సాహంగా ఆసీస్‌
అనుకూల పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు సిద్ధమవుతుంది. ది ఓవల్‌లో పేసర్లకు సానుకూల పరిస్థితుల కోసం కంగారూలు ఎదురు చూస్తున్నారు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ను బౌన్సీ పిచ్‌ ఊరిస్తుండగా, స్టీవ్‌ స్మిత్‌కు ది ఓవల్‌లో తిరుగులేని రికార్డుంది. డెవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజలు ఫామ్‌లో ఉన్నారు. టెస్టు జట్టులో స్మిత్‌కు తోడు మార్నస్‌ లబుషేన్‌ సరికొత్త స్టార్‌గా ఎదిగాడు. భారత జట్టుకు స్మిత్‌, లబుషేన్‌ సవాల్‌గా మారనున్నారు. ట్రావిశ్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌లు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. పేస్‌ విభాగంలో జోశ్‌ హాజిల్‌వుడ్‌ దూరమైనా.. పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, స్కాట్‌ బొలాండ్‌ ప్రమాదకర త్రయం. నాథన్‌ లయాన్‌ ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులో నిలువనున్నాడు. అంచనాలను అందుకునే ప్రదర్శన చేస్తే.. చారిత్రక టెస్టు గద దక్కటం లాంఛనమేనని ఆసీస్‌ శిబిరం దీమా.
పిచ్‌, వాతావరణం
     ది ఓవల్‌ మైదానంలో స్పిన్‌ తరచుగా కీలక పాత్ర పోషిస్తుంది. జూన్‌తో ఇంగ్లాండ్‌లో వేసవి ఆరంభం. అధిక ఉష్ణోగ్రతలు స్పిన్‌కు అనుకూలం. 2012 నుంచి ఇక్కడ జరిగిన 10 టెస్టుల్లో పేసర్ల సగటు 30.57 కాగా, స్పిన్నర్ల సగటు 34.83. ఇక్కడ పేసర్లకు మంచి బౌన్స్‌ లభిస్తుంది. సీమ్‌, స్వింగ్‌ లేకపోతే.. బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించవచ్చు. ఇక ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌కు చివరి రెండు రోజులు వర్షం సూచనలు కనిపిస్తున్నాయి. జూన్‌ 12 రిజర్వ్‌ డే కాగా.. ఆ రోజు సైతం వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే, టెస్టు మ్యాచ్‌లో తొలి మూడు రోజులు ఎటువంటి అంతరాయం కలిగే అవకాశం కనిపించటం లేదు!.
క్రికెట్‌ కింగ్‌, ప్రిన్స్‌ ట్యాగ్స్‌ ప్రజలకు, అభిమానులకు గొప్పగా అనిపిస్తాయి. నాకు తెలిసి జట్టులోని ఏ సీనియర్‌ ఆటగాడి బాధ్యత అయినా.. తమ అనుభవ పాఠాలను అందించి యువ క్రికెటర్ల ఆట మెరుగయ్యేందుకు దోహద పడటం. శుభ్‌మన్‌ గిల్‌ యువ ఆటగాడు. ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ గిల్‌ అదే జోరు చూపిస్తాడని ఆశిస్తున్నాను.
– శుభ్‌మన్‌ గిల్‌పై విరాట్‌ కోహ్లి వ్యాఖ్యలు

Spread the love