– ఆస్తుల రక్షణ, వరదల నిర్వహణ లక్ష్యం
– భూములు ఆక్రమిస్తే ‘ఐపీసీ’ కొరడా
– పరిశ్రమల నుంచి సాగునీటి
– చార్జీల వసూలుకు చట్టబద్ధత
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సాగునీటి ప్రాజెక్టుల ఆస్తుల రక్షణ, వరదల నిర్వహణ, పరిశ్రమల నుంచి సాగునీటి ఛార్జీల వసూలు, విద్యుత్ కేంద్రాలు, పంప్‌హౌజ్ తదితర అంశాలపై స్పష్టతతో కూడిన కొత్త సమగ్ర సాగునీటి చట్టం రూపకల్పనకు రాష్ట్ర సాగునీటి శాఖ ప్రయత్నించింది. గత సంవత్సరం అక్టోబరు ఈ తరహా సన్నాహాలు చేసింది. కొన్ని సమావేశాలు నిర్వహించింది. ప్రభుత్వం మారడంతో కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. పాత చట్టాల్లోని లోపాలను అధ్యయనం చేయడం, ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వాటిని పరిశీలించి పటిష్టమైన కొత్త చట్టాన్ని తయారుచేయడం లక్ష్యం. ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ని సైతం వాడుకోనున్నారు. దీనిపై సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ల స్థాయిలో 2020లోనే ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
పాతవి నాలుగున్నా..
పాతవి నాలుగు చట్టాలున్నా, అవీ లోపభూయిష్టంగా ఉన్నాయనీ, వాటితో ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఉద్దేశ్యంతో కొత్త చట్టం అవసరమని భావిస్తున్నారు. ఈ తరుణంలో కొత్త సమగ్ర చట్టానికి ఊపిరిపోసేందుకు సమాలోచనలు చేశారు. తద్వారా సాగునీటి రంగంలో వస్తున్న అనవసర సమస్యలు, ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కొంత అంతర్గత కృషి జరిగింది. ఈ చట్టంలో సాగునీటి శాఖతోపాటు ప్రాజెక్టుల ఆస్తులను రక్షించడానికి కావాల్సిన రక్షణలు కల్పించాలనే కోణంలో గతంలో కసరత్తు జరిగింది. విద్యుత్ కేంద్రాలు, పంపు హౌజ్‌లు, కాలువలు, ఆస్తుల రక్షణ కోసం అవసరమైన అన్నీ అంశాలపై చర్చించి ఆమేరకే చట్టాన్ని రూపొందించాలని సాగునీటి శాఖ ఉన్నతాధికారులు భావించారు.
కొత్త చట్టం అందుకే
సాగునీటి శాఖ గత సంవత్సరం సెప్టెంబరులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటికి యూజర్‌్ ఛార్జీలు వసూలుకు అవసరమైన నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచాలని గత ప్రభుత్వం భావించింది. ఈ విషయంలో కొత్త సర్కార్ నిర్ణయం ఎలా ఉండనుందో వేచిచూడాల్సిందే. రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూములను ఆక్రమిస్తే ఐపీసీ సెక్షన్ల ఆధారంగా కేసుల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. సాగునీటి శాఖ పరిధిలో 11 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. అలాగే 1.25 కోట్ల ఎకరాలకు సాగునీటిని ఆయా ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్నట్టు గత ప్రభుత్వం చెప్పింది. దాదాపు 80 శాతం భూములకు నీటి సరఫరా జరుగుతున్నదనే ప్రచారం చేసింది. కాగా మిగతా భూములకు భూగర్భజలాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. వరదల నిర్వహణ, భారీ సాగునీటి ప్రాజెక్టులను కొత్త చట్టం పరిధిలోకి తేవాలని సాగునీటి శాఖ యోచిస్తున్నది.
ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం
కేరళ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం సాగునీటి శాఖకు సూచించిన విషయం విదితమే. 1947, 1965, 1984, 1994లో వచ్చిన సాగునీటి, రైతుల చట్టాలకు మార్పులు చేయడం ద్వారా కొత్త చట్టాన్ని రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. ఈమేరకు కొంతకాలం వేగంగా కసరత్తు కొనసాగింది. సర్కారు మారడం, కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలో సీపేజీ(బుంగలు) రావడంతో గత సెప్టెంబరులో సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో కొత్త చట్టం రూపకల్పన కోసం ప్రత్యేకంగా భేటి జరిగింది. ఈ సందర్భంగా కొంతమేర కదలిక వచ్చింది. వచ్చే వారం రోజుల్లో మరోసారి సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పాత చట్టాలను పక్కాగా పరిశీలించడం ద్వారా కొత్త చట్టానికి కోరలు తొడగాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఆదిశగానే కొత్త సమగ్ర సాగునీటి చట్టం రూపొందే అవకాశాలు ఉన్నాయి.
మరికొంత సమయం..
కాళేశ్వరం హడావిడి పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం కొత్త సాగునీటి చట్టంపై దృష్టిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ‘సాగునీటి శాఖకు చెందిన అన్నీ అంశాలపై కొత్త ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ప్రాజెక్టులు, ఆయకట్టు, నిధులు అన్ని విషయాలపైనా అవగాహన ఉంది. కొత్త చట్టంపై దృష్టిపెట్టడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చు’ అని పేరు రాయడానికి ఇష్టపడని ఒక ఇంజినీర్ ఇన్ చీఫ్ ‘నవతెలంగాణ’కు తెలిపారు.