– కేకేపై టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్‌రెడ్డి ఫైర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘నీవో వెన్నుపోటుదారుడివి.కాంగ్రెస్‌కు వెన్నుపోటు పోడిచావు.మా పార్టీకే నీతులు చెబుతావా?’ అంటూ టీపీసీసీ ఉపాధ్యక్షులు జి వినోద్‌రెడ్డి బీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన కేశవరావు వెంటనే ఆయనకు క్షమాపణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాహుల్‌గాంధీని విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేకే ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడూ గెలవని కేశవరావును కాంగ్రెస్ మంత్రిగా, ఎంపీగా చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు పూర్తిగా మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్…ఆ తర్వాత వాటిని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. బుధవారం నుంచి రాష్ట్రంలో యువ పోరాట యాత్ర కొనసాగనుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకైనా నీళ్లించ్చారా? అయోధ్యరెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుతున్న సీఎం కేసీఆర్… దాని ద్వారా ఒక్క ఎకరాకైనా నీళ్లించ్చారా? అని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి సీఎంకేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి రాష్ట్రంలో 19.3 లక్షల విద్యుత్ కనెక్షన్‌లు ఉంటే.. ఇప్పుడు 27.49 లక్షల కనెక్షన్లకు పెరిగాయన్నారు. నిజంగా కాళేశ్వరం ఉపయోగపడితే రైతులు బోర్లు వేసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
2009-14లో తెలంగాణ భవన్‌కు టెలిపోన్ బిల్ చెల్లించకపోతే కనెక్షన్లు కట్ చేశారనీ, ఉద్యోగులకు జీతాలు ఇయ్యక నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ రూ. 1200 కోట్ల ఆస్తులెలా వచ్చాయని చెప్పారు. కాళేశ్వరం సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని చెబుతున్న బీజేపీ నేతలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు అవినీతిపై ఆధారాలతోసహా కేంద్రానికి ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
ఓర్వలేకనే రాహుల్‌పై విమర్శలు: బొజ్జ సంధ్యా రెడ్డి
దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి బొజ్జ సంధ్యారెడ్డి చెప్పారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత మంత్రి హరీశ్‌రావుకు లేదన్నారు. రాహుల్ కుటుంబం త్యాగాల కుటుంబం అని గుర్తు చేశారు.
ఆరోగ్యంగానే ఉన్నా..: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ, అందుకు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. తన ఆరోగ్యంపై ఆర్టీవీ ఛానల్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇప్పటికే బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రేటింగ్స్ కోసం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ…జనాన్ని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు.
బడిబాటలో ఆర్భాటమే తప్ప ఆచరణ లేదు : చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాటలో ఆర్భాటమే తప్ప ఆచరణ లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామలకిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో అధికార ప్రతినిధులు హర్షవర్ధన్ రెడ్డి, గౌరీ సతీష్, కృష్ణ తేజ, సంధ్యారెడ్డి, వచన్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లు పెరిగాయని చెప్పారు. చాలా పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని చెప్పారు. ప్రయివేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో 40వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.