కార్మికుల పక్షాన పోరాడే ఏఐటీయూసీని గెలిపించండి

నవతెలంగాణ-మణుగూరు
కార్మికుల పక్షాన అహర్నిశలు పోరాడే ఏఐటీయూసీని గెలిపించాలని బ్రాంచ్‌ సెక్రటరీ వై.రాంగోపాల్‌ పిలుపునిచ్చారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని డిప్యూటీ ఆర్‌.ఎల్‌.సీ వద్ద సింగరేణి యూనియన్‌ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కార్మికులను కలుపుకొని అనేక పోరాటాలు చేసినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరించడం వలన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికుల పక్షాన యూనియన్‌ కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని అన్నారు. కోర్టు మూడు నెలల్లో యూనియన్‌ ఎన్నికలు నిర్వహించవలసిందిగా స్పష్టమైన తీర్పు ఇచ్చిన సందర్భంలో యాజమాన్యం అన్ని యూనియన్లను పిలిచి ఎన్నికలకు సంసిద్ధం అని తెలిపి ప్రొడక్షన్‌ సాకు చూపి కోర్టు ద్వారా వాయిదా కోరింది. జూన్‌ నెలలో కోర్టు తీర్పు ఇవ్వగా ఆగస్ట్‌, సెప్టెంబర్లలో ఎన్నికలు నిర్వహిస్తామని వాయిదా కోరింది. కోర్టు అక్టోబర్‌ 28వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని సూచించినా అసెంబ్లీ ఎన్నికలు సాకుగా చూపించి మళ్లీ వాయిదా కోరింది. దీంతో రాష్ట్ర హైకోర్టు డిసెంబర్‌ 27వ తేదీన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చిందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కార్మికుల సమస్యలు పేరుకుపోయాయని పరిష్కారం కావడం లేదని అన్నారు. కావున సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికలలో సంస్థ పరిరక్షణ కార్మికుల హక్కుల రక్షణ కోసం అహర్నిశలు పోరాడే ఏఐటీయూసీ యూనియన్‌ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేకల ఈశ్వరరావు, ఆవుల నాగరాజు, సురేందర్‌, పిట్‌ సెక్రటరీలు కోడి రెక్కల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love