విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు వదిలిన వైనం.. కానిస్టేబుల్ ఫలితాల్లో విజేత

నవతెలంగాణ- టేకులపల్లి: కానిస్టేబుల్ నియామక పరీక్ష రాసి సివిల్స్ కోసం ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాడు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఇవ్వడంతో స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన ఆ యువకుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.. అయితే, తాజాగా ప్రకటించిన ఫలితాల్లో ఆ యువకుడు కానిస్టేబుల్ గా ఎంపికవడం విశేషం. వివరాలలోకి వెలితే.. టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పరిధిలోని పాతతండాలో గత ఆగస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.  పాతతండాకు చెందిన భూక్య ప్రవీణ్ ఉన్నత ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. బీటెక్ పూర్తి చేసి కానిస్టేబుల్ పరీక్షలు రాశాడు. ఆపై ఢిల్లీ వెళ్లి సివిల్స్ కు సిద్ధమయ్యేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. గత ఆగస్టులో స్నేహితుడిని కలిసేందుకు ఖమ్మం వెళ్లాడు. సిటీలో మిగతా స్నేహితులతో కలిసి ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ప్రవీణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కొడుకు పెద్ద ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటాడని వారు కన్న కలలన్నీ కల్లలయ్యాయి.

Spread the love