ఆహార ద్రవ్యోల్బణానికి రెక్కలు

ఆహార ద్రవ్యోల్బణానికి రెక్కలు– అన్నదాతకు నష్టాన్నే మిగిల్చిన మోడీ విధానాలు
– ఎదుగూ బొదుగూ లేని ఆదాయంతో ప్రజల బెంబేలు
– ఆకాశాన్ని తాకిన నిత్యావసరాల ధరలు
న్యూఢిల్లీ : బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘మోడీ కీ గ్యారంటీ’ అనే పదం 66 చోట్ల కన్పిస్తుంది. ఒక పేజీలో అయితే పాతిక సార్లు దర్శనమిచ్చింది. ‘ద్రవ్యోల్బణం’ అనే మాట కూడా అనేక చోట్ల కన్పిస్తోంది. గత దశాబ్ద కాలంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించామని, అధిక వృద్ధి రేటు సాధించామని, ద్రవ్య సుస్థిరత చేకూర్చామని బీజేపీ ప్రణాళిక తెలిపింది. దీనిని కొనసాగిస్తామని, భారత ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది. అయితే బీజేపీ వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదని గణాంకాలు చెబుతున్నాయి.
మార్కెట్‌ నియంత్రణలే కారణం
ఆహార ధరలను తగ్గించడానికి మోడీ ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులపై కఠినమైన మార్కెట్‌ నియంత్రణలు తీసుకొచ్చింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో… అంటే 4 శాతంగా ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. దేశీయ ఆహార ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తరచుగా వ్యవసాయ ఎగుమతులపై నిషేధం విధించడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఎగుమతులపై నిషేధం విధించడంతో కొన్ని ఆహార వస్తువుల ధరలు తగ్గినప్పటికీ రైతులు బాగా నష్టపోయారు. 2014-24 మధ్యకాలంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గినా ఆహార ద్రవ్యోల్బణం మాత్రం పెరుగుతూనే ఉంది.
2016 జూన్‌లో అది 22 నెలల గరిష్ట స్థాయికి చేరింది. టమాటాలు సహా కూరగాయల ధరలు పెరగడమే దీనికి కారణం.
దశాబ్దం గడిచినా ఆదాయం పెరగలేదు
2023 ఏప్రిల్‌-జూలై మధ్యకాలంలో మొత్తం ద్రవ్యోల్బణంలో ఆహార ద్రవ్యోల్బణం వాటా 87 శాతంగా ఉంది. ఇదే కాలంలో ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుతున్న కూరగాయల ధరల వాటా 80 శాతంగా దేశ జనాభాలో 60 శాతం మంది రోజుకు రూ.250 ఆదాయంతో సరిపెట్టుకుంటున్న పరిస్థితుల్లో ధరాఘాతాన్ని వారు ఎలా తట్టుకోగలరు? అయితే ఆహార ద్రవ్యోల్బణం అనేది కొత్త సమస్యేమీ కాదు. కానీ వేతనాల్లో పెరుగుదల లేకపోవడం, నిరుద్యోగ సమస్య అధికం కావడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. ఉద్యోగుల జీతాలు, స్వయం ఉపాధి పొందే వారి వేతనాలు 2014 నుండి 2024 వరకూ ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే ఉండిపోయాయి. వాస్తవానికి వ్యవసాయ కార్మికుల వేతనాలు గత దశాబ్ద కాలంలో ప్రతి ఏటా 1.3 శాతం మేర తగ్గుతున్నాయి. మొత్తంగా చూస్తే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రజల ఆదాయం పెరగడం లేదన్నది సుస్పష్టం.
యూపీఏపై విమర్శలు
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచామని చెప్పుకుంటున్న మోడీ పాలనలో గత సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటాల ధర రూ.350 పలికిన విషయం తెలిసిందే. 2014లో అధికారంలోకి రావడానికి ముందు మోడీ ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘యూపీఏ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. తప్పుడు విధానాలు అనుసరించడం, ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది’ అని విమర్శించారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మోడీ, తన హయాంలో కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

Spread the love