ఆసరా కోసం ఆరాటం

Craving for support– ఎంపీడీవో కార్యాలయంలో ఓ అనాథ మహిళ పడిగాపులు
– అక్కున చేర్చుకున్న అంగన్‌వాడీ ఉద్యోగులు
– వికలాంగుల సర్టిఫికెట్‌ ఉన్నా పింఛన్‌ రాని వైనం
– సఖీ కేంద్రానికి తరలింపు
– రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి ( ఇబ్రహీంపట్నం)
ఆసరా కోసం ఎదురుచూస్తున్న ఓ అనాథ మహిళను అంగన్‌వాడీ ఉద్యోగులు అక్కున చేర్చుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓ మహిళ తనకు పింఛన్‌ కావాలని, ట్రై సైకిల్‌ ఇప్పించాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేదు. దాంతో అంగన్‌వాడీలు ఆమెతో మాట్లాడి.. ఆ మహిళ అనాథగా గుర్తించారు. ఆమెను సీడీపీవో కార్యాలయానికి తీసుకెళ్లి.. అనంతరం సఖి కేంద్రానికి తరలించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ.. ఎంపీడీఓ కార్యాలయానికి సోమవారం ఉదయం వచ్చింది. అక్కడున్న సిబ్బంది ఏం కావాలని ఆమెను ప్రశ్నించగా.. తనది పోచారం గ్రామమని.. తనకు ట్రై సైకిల్‌ కావాలని, ఆసరా పింఛన్‌ ఇప్పించాలని, ఎంపీడీవోను కలిసేందుకు వచ్చానని సమాధానం ఇచ్చింది.
ఎంపీడీవో ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత కల్పిస్తామని సిబ్బంది చెప్పడంతో కార్యాలయ ఆవరణలోనే వేచి ఉంది. కానీ ఎంపీడీఓ సమయానికి రాకపోవడంతో అక్కడే కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోను కలవాలని సూచించారు. దాంతో ఆమె ప్రజావాణికి వెళ్ళింది. అక్కడ ఆర్డీవో అనంతరెడ్డి ఆమెను తన సమస్య ఏమిటని ప్రశ్నించగా… ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో సిబ్బందిని పిలిపించిన ఆర్డీవో సదరు మహిళ సమస్య కనుక్కోవాలని సూచించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణ తన సెక్షన్‌కు ఆమెను తీసుకెళ్లి వివరాలు కనుకునే ప్రయత్నం చేయగా.. పొంతనలేని సమాధానం ఇచ్చింది. తనది ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామం అని ఒకసారి చెప్పగా.. మరోసారి మహబూబ్‌నగర్‌ జిల్లా అని చెప్పింది. అయితే ఆమె వద్ద ఉన్న ఆధార్‌, ఇతర సర్టిఫికెట్లను పరిశీలించే ప్రయత్నం చేశారు. అయితే ఆమెకు 43 శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్‌ ఉంది. తుర్కయాంజల్‌ అడ్రస్‌ పేరుతో ఆధార్‌ కార్డు ఉంది. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో కృష్ణ లిఖితపూర్వకంగా ఆసరా పింఛన్‌ కోసం దరఖాస్తు రాయించుకొని సంతకం తీసుకున్నారు. కాగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఐసీడీఎస్‌ ఉద్యోగులు వెంటనే ఆ మహిళ దగ్గరకు వచ్చి ఆమె కచ్చితమైన వివరాలు కనుక్కున్నారు. తాను అనాథనని, తనకు ఎవరూ లేరని.. ఎక్కడ బతకాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని, వచ్చిరాని మాటలతో సమాధానం చెప్పింది. ఆమెకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, అనంతరం వనస్థలిపురంలోని సఖీ కేంద్రానికి తరలించి, పునరావాసం కల్పించి.. తన ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తామని ఐసీడీఎస్‌ ఉద్యోగులు సరళ, పల్లవి ‘నవతెలంగాణ’తో చెప్పారు.
అంతకుముందు ఆమె ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్ళింది. తనది పోచారం గ్రామం అని చెప్పడంతో అక్కడి సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లాలని చెప్పారు. అయితే తన చిన్నతనంలోనే శరీరం కాలిపోవడంతో కొంత మతిస్థిమితం కోల్పోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఆమెకు వైద్యం అందిస్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు.

Spread the love