సైబ‌ర్ సెక్యూ‌రిటీపై ఆస‌క్తితో…

Interested in cyber security...సరోజా రాయ్‌… సమాజంలోని మూఢనమ్మకాలను తరమికొట్టేందుకు తండ్రితో కలిసి వందలాది మ్యాజిక్‌ షోలు చేసింది. అంతేనా దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలు, రెండవ మహిళా స్టేజ్‌ హిప్నాస్టిక్‌గా పదేండ్ల కిందటే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ లెక్చరర్‌గా, ఓ కౌన్సెలర్‌గా, ఓ సైకాలజిస్ట్‌గా, ఓ ట్రైనర్‌గా, సైబర్‌ నేరస్తులని పట్టిచ్చే ఫోరెన్సిక్‌ సైకాలజిస్ట్‌గా గత ఏడేండ్ల నుండి సైకాలజీ రంగంలో విభిన్న పాత్రలు పోషిస్తుంది. హిప్నో కమలాకర్‌ కూతురుగానే కాక సమాజంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
అమ్మ డా.హిప్నో పద్మా కమలాకర్‌, నాన్న హిప్నో కమలాకర్‌. మాది తూర్పుగోదావరి జిల్లా. రెండో తరగతి వరకు రాజమండ్రిలో చదువుకున్నాను. నాకు ఓ తమ్ముడు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ వచ్చేశాము. ఆక్స్‌వర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశా. ఇంటర్‌ ఎంపీసీ సెయింట్‌ మేరీస్‌లో చేశా. చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం చాలా ఇష్టం. ఎనిమిదో తరగతి నుండి ఆటో మొబైల్‌ డిజైనర్‌ కావాలనుకున్నాను. ఎలాగైనా ఎన్‌ఐడీలో సీటు తెచ్చుకోవాలనుకున్నాను. కానీ రాలేదు. వేరే చోట సీటు వచ్చింది కానీ వెళ్లలేకపోయాను. దాంతో విల్లా మేరీలో డిగ్రీ చేరాను. సైకాలజీ, జర్నలిజం, లిటరేచర్‌ సబ్జెక్ట్స్‌ తీసుకున్నా. అక్కడ థియేటర్‌లో మూడేండ్లు బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు తీసుకున్నాను. అలాగే ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిలిం, డైరెక్టర్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ ఇలా డిగ్రీ చేసేటప్పుడే అన్నీ నేర్చుకున్నాను. కొన్ని పత్రికల్లో ఇంటన్‌షిప్‌ కూడా చేశాను. అయితే నా సబ్జెక్ట్స్‌లో సైకాలజీ కూడా ఉండటంతో డిగ్రీ అయిపోయిన తర్వాత డాడీ ఫ్రెండ్స్‌ చాలా మంది ఎమ్మె సైకాలజీ చేయాల్సిందిగా ప్రోత్సహించారు. అయితే సైకాలజీలో ఏదైనా కొత్తగా చేయాలని క్లీనికల్‌ కాకుండా ఫోరెన్సిక్‌ సెలక్ట్‌ చేసుకున్నాను.
రీసర్చ్‌ అంటే ఇష్టం
డిగ్రీ తర్వాత గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో ఫొరెన్సిక్‌ సైకాలజీ చేశాను. నాకు మొదటి నుండి రీసర్చ్‌ అంటే చాలా ఇష్టం. కొత్తగా ఏదైనా నేర్చుకోడానికే ఎప్పుడూ ఆసక్తి చూపేదాన్ని. తర్వాత మధ్య ప్రదేశ్‌లోని అమిటి యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీలో ఎంఫిల్‌ చేశాను. యూనివర్సిటీ సెకండ్‌ ర్యాంక్‌ వచ్చింది. అది చేస్తూనే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ అనే సబ్జెక్ట్‌పై డిప్లొమా కోర్సు చేశాను. తర్వాత నేను మాస్టర్స్‌ చేసిన కాలేజీలోనే రెండేండ్లు లెక్చరర్‌గా చేశాను.
ఫోరెన్సిక్‌ సైకాలజిస్టుగా…
2018లో ఢిల్లీలోని అన్ని పోలీస్‌ స్టేషన్స్‌లో ఫోరెన్సిక్‌ సైకాలజిస్టులు ఉండాలనే నిబంధన పెట్టారు. నేరస్తులు నిజం చెబుతున్నారా లేదా, ఎలాంటి మానసిక పరిస్థితుల్లో వాళ్లు నేరాలు చేస్తున్నారు, దొంగ సాక్షాలు ఏమైనా సృష్టించారా వంటివి ఫోరెన్సిక్‌ సైజాలజిస్టులు తెలుసుకోగలుగుతారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ పోస్టులు చాలా అవసరం. ఢిల్లీ తర్వాత రాజస్థాన్‌, పంజాబ్‌ పోలీసులు కూడా ఈ పోస్టులు భర్తీ చేశారు. కానీ మన రాష్ట్రంలో ఎందుకో దీని గురించి అంత సీరియస్‌గా ఆలోచించడం లేదు.
ఫోరెన్సిక్‌ చాలా ప్రత్యేకం
లెక్చరర్‌గా చేస్తూనే సైబర్‌ సైకాలజీపై, ఎథికల్‌ హాకర్స్‌పై రీసర్చ్‌ చేశాను. అంటే ఇది సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించింది. వాళ్లు చెప్పేది నిజమా కాదా, ఇంకా ఏమైనా దాస్తున్నారా అనేదానిపై నా రీసర్చ్‌. టెక్నాలజీ పెరిగిన తర్వాత మోసాలు చేసే విధానం కూడా మారిపోయింది. చివరకు జనాలను చంపడానికి కూడా ఆన్‌లైన్‌ను ఉపయోగించు కుంటున్న కాలమిది. వీటినే సోషల్‌ ఇంజనీరింగ్‌ ఎటాక్స్‌ అంటారు. ఈ మధ్య కాలంలో ఇవి బాగా పెరిగిపోయాయి. దీనిపై అవగాహన ప్రజలకు చాలా అవసరం. నేరం చేసిన వారి నుండి చేసిన నేరాన్ని రాబట్టడం చాలా అవసరం. క్లీనికల్‌ కన్నా ఫోరెన్సిక్‌ చాలా కష్టమైనది. ఎలా అంటే సైకాలజిస్టు దగ్గరకు అందరూ తమ సమస్యను పరిష్కరించుకోడానికి వారంతట వాళ్లే వస్తారు. కానీ ఫోరెన్సిక్‌లో బలవంతంగా వస్తారు. నేరం చేసిన వాడు మనకు సహకరించడు. అతను చెప్పేది నిజమా కాదా తెలీదు. అలాంటి వాళ్లను హాండిల్‌ చేయాలి.
ఏవియేషన్‌ సైకాలజీలో…
బెంగుళూరులో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ సైకాలజీలో ఎనిమిది నెలలు పని చేశాను. అక్కడ డాక్టర్‌ సౌగంధి అనే సీనియర్‌ సైంటిస్ట్‌ వద్ద వర్క్‌ చేశాను. ఆమె డీఆర్‌డీఏలో పని చేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడే ఏవియేషన్‌లో సైకాలజీని ప్రవేశపెట్టారు. అంటే పైలెట్‌ మానసిక పరిస్థితి ఎలా ఉంది, దాన్ని నడపటానికి అతను సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది మేము అంచనా వేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఫిట్‌ – అన్‌ఫిట్‌ అనేది అంచనా వేస్తాం. అలాగే వాళ్ళ ట్రైనింగ్‌ ఎలా ఉండాలి, ట్రైనింగ్‌ పద్ధతులు ఎలా ఉంటే వాళ్లు సులభంగా నేర్చుకోగలరు అనే దానిపై కూడా మేము స్టడీ చేసేవాళ్లం.
ముందే అవగాహన ఉంటే…
టెక్నాలజీ పెరిగిపోతుంది. దీని కోసం లక్షల మంది ఇంజనీర్లు పని చేస్తున్నారు. ఒక కొత్త యాప్‌ తయారవుతుందంటే దాని వల్ల మనిషికి లాభమెంతో, నష్టమెంతో కూడా ముందే ఒక అంచనా వుండాలి. కానీ అలాంటి పద్ధతి మన దగ్గర లేదు. టెక్నాలజీపై ప్రజలకు పూర్తి అవగాహన లేదు. అందుకే చాలా మంది టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. అదే పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఈ నష్టాలు ఉంటాయి అని ప్రజలకు ముందే అవగాహన కల్పిస్తే జాగ్రత్తగా ఉంటారు. టెక్నాలజీ వల్ల సాధ్యమైనంత వరకు మనిషికి నష్టం జరగకుండా చూడాలి. అలాంటి టెక్నాలజీ అభివృద్ధి కావాలి. సైబర్‌ నేరాలను కంట్రోల్‌ చేయాలి. ఆ ఆసక్తితోనే సైబర్‌ సెక్యూరిటీపై వర్జీనియాలోని ఓల్డ్‌ డొమీనియన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయబోతున్నాను.
అవగాహన కల్పించేందుకు
చిన్నప్పటి నుండి నాతో తమ్ముడితో నాన్న మ్యాజిక్‌ షోలు చేయించేవారు. మంత్రాలు, తంత్రాలు కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం నాన్న మాతో ఇలా చేయించేవారు. డిగ్రీలో ఉన్నప్పుడు హిప్నాటిజం కూడా స్టార్ట్‌ చేశాను. అప్పటికే సినిమాల్లో హిప్నాటిజం ను చాలా తప్పుగా ప్రచారం చేసేవారు. నేరాలు చేయడం కోసం దీన్ని ఉపయోగిం చుకునేవారు. అయితే ఇది చాలా బాగా ఉపయోగించుకోవల్సిన సైన్స్‌. మాటల ద్వారా మనిషిని ప్రేరేపించే మనోవైజ్ఞానిక శాస్త్రమే హిప్నాటిజం అంటారు నాన్న. అందుకే అనేక రాష్ట్రాలు తిరిగి ఆయన దీని గురించి ప్రచారం చేసేవారు.
– సలీమ

Spread the love