– భయపెడితే భయపడేవారెవ్వరూ లేరు : కేంద్రమంత్రి బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు లీగల్ నోటీసు జారీ చేశారనికేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఆయన్ను చూస్తుంటే జాలేస్తున్నదని పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీమంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్టు మీడియాలో చూశానని తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవ్వరూ లేరనీ, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే అని తెలిపారు. అందుకు బదులుగానే తాను మాట్లాడానని పేర్కొన్నారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడనీ, ఆయన బాగోతమంతా ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో అందరికీ తెలుసని తెలిపారు.