నవతెలంగాణ హైదరాబాద్: ఊరి సర్పంచ్ వేదింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆరేండ్ల క్రితం తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా సర్పంచ్ తనను మానసికంగా వేధిస్తున్నడని మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన గుర్రం సరళ అనే మహిళ నుంచి అదే గ్రామ సర్పంచ్ అయిన కొక్కు లింగమూర్తి ఆరేండ్ల కిందట రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా ఆయన దాని ఊసే ఎత్తకపోవడంతో సరళ ఇటీవల గ్రామ పెద్దలను ఆశ్రయించింది. అప్పు తీసుకున్న వ్యక్తి సర్పంచ్ కావడంతో వారుకూడా ఏమీ చేయలేకపోయారు. మూడు రోజుల క్రితం సరళ తన భర్తతో కలిసి సర్పంచ్ ఇంటికెళ్లి డబ్బులు అడగగా ఆయన దురుసుగా ప్రవర్తించడంతో పాటు హేళన చేశాడు.
దాంతో మనోవేదనకు గురైన సరళ ఈ నెల 22న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బంధువులు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె శనివారం మృతి చెందింది. దీంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామ సర్పంచ్ లింగమూర్తితో పాటు సరళ వద్ద రూ. 8లక్షలు అప్పు తీసుకున్న ఆమె బంధువు అశోక్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.